సీఈసీగా బాధ్యతలు చేపట్టిన జ్ఞానేశ్ కుమార్

సీఈసీగా బాధ్యతలు చేపట్టిన జ్ఞానేశ్ కుమార్
26వ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)గా జ్ఞానేశ్ కుమార్ బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన సీఈవో జ్ఞానేశ్‌ కుమార్‌కు ఎన్నికల కమిషనర్ సుఖ్బిర్ సింగ్ సింధు అభినందలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ దేశ నిర్మాణానికి తొలి అడుగు ఓటింగ్‌ అని పేర్కొంటూ 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయుడు ఎలక్టర్‌గా మారాలని కోరారు. 
 
ఎన్నికల సందర్భంగా ఎల్లప్పుడూ ఓటర్లు ఓటు వేయాలని తెలిపారు. భారత రాజ్యాంగం ప్రకారం, ఎన్నికల చట్టాలు, నియమాలు అందులో జారీ చేసిన సూచనల ప్రకారం, భారత ఎన్నికల సంఘం ఎల్లప్పుడూ ఓటర్లతో ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు.

నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ)గా జ్ఞానేశ్‌ కుమార్‌ పేరును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ఖరారు చేసింది. నూతన సీఈసీ నియామకంపై రాష్ట్రపతి ద్రౌపదిముర్ము సోమవారం  రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో 26వ సీఈసీగా జ్ఞానేశ్ కుమార్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. 

సీఈసీగా జ్ఞానేశ్‌ కుమార్‌ పదవీ కాలం 2029 జనవరి 26 వరకు ఉండనుంది. అలాగే ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్‌ కుమార్‌ స్థానంలో హరియాణా కేడర్‌ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ వివేక్‌ జోషి నియమితులయ్యారు.

కాగా.. 1988 బ్యాచ్ కేరళ కేడర్​కు చెందిన ఐఏఎస్ అధికారి జ్ఞానేశ్​కుమార్. ఐఐటీ కాన్పూర్ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్​ చేసిన ఆయన ఐసీఎఫ్ఏఐలో బిజినెస్ ఫైనాన్స్, యూఎస్‌లోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని హెచ్ఐఐడీలో ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ చదివారు. 2024 జనవరిలో సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా రిటైర్ అయ్యారు. 

కేంద్ర హోంశాఖలో సీనియర్ అధికారిగా పనిచేసిన ఆయన జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామ మందిర ట్రస్టు ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. రామ మందిరంపై సుప్రీంకోర్టు విచారణలను కూడా జ్ఞానేశ్ కుమార్ క్రమం తప్పకుండా పర్యవేక్షించినట్టు తెలుస్తోంది.