రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ తటస్థంగా లేదు 

రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ తటస్థంగా లేదు 

* ట్రంప్ భారత్ కు ఎఫ్-35 యుద్ధ విమానాల అమ్మకంకు సిద్ధం

రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైట్ హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన సమావేశంలో భారతదేశం తటస్థంగా లేదని పేర్కొంటూ బలమైన సందేశం ఇచ్చారు. యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తూ, భారతదేశం శాంతికి అండగా నిలుస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. 
 
“భారతదేశం తటస్థంగా లేదు. భారతదేశం శాంతికి మద్దతు ఇస్తుంది. ఇది యుద్ధ యుగం కాదని నేను ఇప్పటికే అధ్యక్షుడు పుతిన్‌తో చెప్పాను. అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ప్రయత్నాలకు నేను మద్దతు ఇస్తున్నాను” అని ప్రధాని ప్రకటించారు. ట్రంప్ రష్యా వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్‌కు చెందిన వోలోడిమిర్ జెలెన్స్కీలతో వేర్వేరుగా ఫోన్ కాల్స్ చేసిన ఒక రోజు తర్వాత మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరింప చేసుకున్నాయి.
 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ భేటీ సందర్భంగా ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు చర్చలు జరిపారు. సుంకాలు, వలసలు, ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం తదితర కీలక అంశాలపై ప్రధానంగా చర్చించారు. అనేక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు ట్రంప్‌ వివరించారు.
 
“అమెరికా ప్రపంచంలోనే పురాతన ప్రజాస్వామ్యం. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం. రెండు కలిసి వచ్చినప్పుడు 1+1 = 2 కాదు. 11ని చేయగలం. ఇది మానవాళి సంక్షేమం కోసం పనిచేసే శక్తి. నా స్నేహితుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇరుదేశాల పురోగతి, శ్రేయస్సు కోసం మనం కలిసి ముందుకు సాగాలని కలిసి సంకల్పించాం” అని ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలిపారు.

ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పే ప్రణాళికలో భారత్‌ పాత్రపై మాట్లాడిన ట్రంప్‌- తాము బాగా కలిసిపోయి పనిచేస్తున్నట్లు వివరించారు. అలాగే రెండు దేశాలు రికార్డు స్థాయిలో వ్యాపారం చేయబోతాయని అనుకుంటున్నట్లు ట్రంప్‌ చెప్పారు. సమీప భవిష్యత్తులో భారత్‌- అమెరికాలు అనేక పెద్ద వాణిజ్య ఒప్పందాలను ప్రకటించబోతున్నాయని వెల్లడించారు. భారత్‌- అమెరికా కోసం కొన్ని అద్భుతమైన వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోబోతున్నామని చెప్పారు.

డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి అత్యాధునిక యుద్ధ విమానాలు ఎఫ్-35లను  విక్రయించడానికి ముందుకొచ్చారు.  ట్రంప్ తిరిగి వచ్చిన తర్వాత వైట్ హౌస్‌ను సందర్శించిన నాల్గవ ప్రపంచ నాయకుడు అయిన ప్రధాని మోదీతో భారతదేశంతో తాను “ప్రత్యేక బంధాన్ని” కనుగొన్నానని ట్రంప్ తెలిపారు. ప్రధాని మోదీని తన కంటే “చాలా కఠినమైన సంధానకర్త” అని ప్రశంసించారు.

“ఈ సంవత్సరం నుండి, మేము భారతదేశానికి సైనిక అమ్మకాలను అనేక బిలియన్ డాలర్లకు పెంచుతాము. చివరికి భారతదేశానికి ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్‌లను అందించడానికి కూడా మేము మార్గం సుగమం చేస్తున్నాము” అని ట్రంప్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సంయుక్త మీడియా సమావేశంలో ప్రకటించారు. 

ఓవల్‌ ఆఫీస్‌లో జరిగిన ఈ భేటీలో విదేశాంగ మంత్రి జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శ్వేతసౌధంలోకి అడుగుపెట్టిన మోదీని ట్రంప్‌ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ప్రధాని మోదీ డొనాల్డ్‌ ట్రంప్‌ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. 

రెండో సారి వైట్‌హౌజ్‌లోకి అడుగుపెట్టిన ట్రంప్‌నకు 140కోట్ల మంది భారతీయుల తరఫున అభినందనలు తెలియజేస్తున్నట్లు మోదీ తెలిపారు. ట్రంప్ అనే పేరు, మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ అనే వ్యాఖ్య విడదీయలేనివని మోదీ వివరించారు. అలాగే 140 కోట్ల మంది భారతీయులకు కూడా 2047నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలనే సంకల్పం ఉందని మోదీ తెలిపారు. 

ట్రంప్‌ హయాంలో ఇరుదేశాల మధ్య మంచి సత్సంబంధాలు ఉంటాయని ఆకాంక్షించిన మోదీ అహ్మదాబాద్‌, హ్యూస్టన్‌లలో నిర్వహించిన నమస్తే ట్రంప్‌, హౌడీ- మోదీ ర్యాలీల గురించి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ చర్చించుకుంటున్నారని గుర్తుచేశారు. ప్రాచీన ప్రజాస్వామ్య దేశమైన అమెరికా, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లు కలిస్తే ఒకటి ఒకటి పదకొండు అవుతుందని అని మోదీ చెప్పారు.