
రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి భారత సంతతి ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ‘చల్లని వాతావరణం ఉన్నప్పటికీ, వాషింగ్టన్ డీసీలో తనకు ప్రత్యేకంగా స్వాగతం పలికినందుకు ప్రవాస భారతీయులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అమెరికాలోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా, ఇతర అధికారులు ప్రధాని మోదీని విమానాశ్రయంలో స్వాగతించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు ఆయన అమెరికా పర్యటన చేపట్టారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. “డొనాల్డ్ ట్రంప్‌ను కలవడానికి, భారతదేశం-యుఎస్ఎ సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించడానికి ఎదురుచూస్తున్నాను. మన దేశాలు, మన ప్రజల ప్రయోజనం కోసం మెరుగైన భవిష్యత్తు కోసం కలిసి పనిచేస్తూనే ఉంటాయి” అని ఆయన పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం తెల్లవారుజామున అమెరికాకు చేరుకున్నారు. అమెరికాకు చేరుకున్న తర్వాత ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్‌తో భేటీ అయినట్లు తెలిపారు. ఇరుదేశాల మధ్య ఉన్న స్నేహ సంబంధాలపై ఆమెతో చర్చలు జరిపినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా భారత్- అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో కొత్త అధ్యయనం మొదలైందని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాంగ్రెస్ చట్టసభ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులతో మోదీ భేటీ కానున్నట్లు వెల్లడించింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
స్టార్‌లింక్ సేవలపై ఆయనతో చర్చించే అవకాశం ఉందంటూ పలు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇక, అమెరికాతో ద్వైపాక్షిక బంధం మరింత బలోపేతమయ్యేందుకు తన పర్యటన దోహదపడుతుందని ఫ్రాన్స్, అమెరికా పర్యటనలకు బయలుదేరి వెళ్లే ముందు మోదీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్యం, రక్షణ, ఇంధన సరఫరా రంగాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని సుదృఢం చేయడానికి తన పర్యటన ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇరువురు నేతలు తొలిసారి భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య వాణిజ్యం, సుంకాల రాయితీ, అక్రమ వలసదారులు తదితర అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
దీనికి ముందు ఫ్రాన్స్‌లో పర్యటించిన మోదీ, ఏఐ యాక్షన్ సమ్మిట్‌కు ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో కలిసి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంశాలతో పాటు పలు అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపైనా విస్తృతంగా చర్చలు జరిపారు.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు