భారత్‌, ఫ్రాన్స్‌ల మధ్య సంబంధాలు మరింతబలోపేతం

భారత్‌, ఫ్రాన్స్‌ల మధ్య సంబంధాలు మరింతబలోపేతం

* ఫాన్స్‌లో భారత్ నూతన కాన్సులేట్‌ ప్రారంభం

భారత్‌, ఫ్రాన్స్‌ల మధ్య వాణిజ్య, పెట్టుబడుల సంబంధాలను మరింత పెంపొందించుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌లు పిలుపునిచ్చారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో, అలాగే వివిధ అంతర్జాతీయ వేదికలపై సహకారాన్ని పెంచుకోవాలని అంగీకారానికి వచ్చారు. 
 
ఇరువురు నేతల ద్వైపాక్షిక భేటీ అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం ఊపందుకోవడం పట్ల నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరంలో ద్వైపాక్షిక సహకారానికి ప్రాధాన్యతా రంగాలుగా డిజిటల్‌ ఆరోగ్యం, సూక్ష్మజీవుల నిరోధకత, ఆరోగ్య నిపుణుల పరస్పర మార్పిడి వంటి రంగాలను గుర్తించారు.
 
కృత్రిమ మేథస్సును వినియోగించేందుకు నిర్దేశించే ప్రమాణాలను ప్రజాస్వామిక విలువలు ప్రతిబింబించేలా చూడాల్సి వుందని ఇరు దేశాలు అభిప్రాయపడ్డాయి. ప్రజా ప్రయోజనాల కోసమే ఎఐని వాడాలని నేతలు పేర్కొన్నారు. ఎఐ అభివృద్ధిని పరిచే ప్రక్రియలో ఇరు దేశాలు భాగస్వామ్యం కావాలని నిర్ణయించారు. 
 
ఇంధన భద్రతకు అణు విద్యుత్‌ చాలా కీలకమని నొక్కి చెబుతూ అధునాతన అణు రియాక్టర్లను సంయుక్తంగా అభివృద్దిపరచాలనే లక్ష్యాన్ని ఇరు దేశాలు నొక్కి చెప్పాయి. ఈ మేరకు ఒక అవగాహనా ఒప్పందంపై సంతకాలు కూడా చేశారు. తక్కువ కార్బన్లు వినియోగించుకునే ఆర్థిక వ్యవస్థ దిశగా పరివర్తన చెందడానికి, ఇంధన భద్రతకు అణు ఇంధనమనేది చాలా కీలకంగా మారిందని నొక్కి చెప్పారు. 
 
రక్షణ, రోదసీ, పౌర అణు సహకారం, ఆరోగ్యం, ప్రజల మధ్య సహకారం వంటి రంగాల్లో పురోగతిని నేతలు సమీక్షించారు. 2026ను భారత్‌, ఫ్రాన్స్‌ ఆవిష్కరణల సంవత్సరంగా ఇరువురు నేతలు ప్రకటించారు. ఈ మేరకు ఇరువురు నేతలు దీని లోగోను ఆవిష్కరించారు. ప్రధానంగా ఎఐపైనే ద్వైపాక్షిక చర్చలు కేంద్రీకృతమయ్యాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రి చెప్పారు. 
 
యూరప్‌, పశ్చిమాసియా, ఇండో-పసిఫిక్‌ ప్రాంతాల్లో నెలకొన్న పరిణామాలపై పరస్పరం అభిప్రాయాలు వ్యక్తం చేసుకున్నారని తెలిపారు. విభిన్నమైన వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరిగాయన్నారు.
 
అనంతరం ఇరువురు నేతలు ఫ్రాన్స్‌ అద్యక్ష విమానంలో మార్సెల్లె నగరానికి చేరుకున్నారు. అక్కడ కొత్తగా భారత కాన్సులేట్‌ కార్యాలయాన్ని సంయుక్తంగా ప్రారంభించారు. ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఈ కార్యాలయం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. 
 
అనంతరం మజర్గ్యూస్‌ యుద్ధ వీరుల సమాధిని సందర్శించి పుష్పగుచ్ఛాలుంచి అంజలి ఘటించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన 205 మంది భారతీయ సైనికులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ యుద్ధంలో అశువులు బాసిన వీరుల త్యాగానికి గుర్తుగా ఫ్రాన్స్‌ ప్రభుత్వం గతంలో మార్సెల్లె నగరంలో యుద్ధ స్మారకాన్ని నిర్మించింది. 
 
కామన్‌వెల్త్‌ వార్‌ గ్రేవ్స్‌ కమిషన్‌ (సిడబ్ల్యుజిసి) ఈ స్మారక నిర్వహణా బాధ్యతలు చూస్తుంది. ఫ్రాన్స్‌లో రెండు రోజుల పర్యటన ముగించుకుని ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్ళారు.