కుంభమేళా సందర్భంగా అనేక చోట్ల పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్

కుంభమేళా సందర్భంగా అనేక చోట్ల పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్
 
* త్రివేణి సంగమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పుణ్యస్నానం
 
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం  జరుగుతున్న మహా కుంభమేళాకు రోజురోజుకు లక్షలాది మంది భక్తులు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లోని అనేక చోట్ల పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది. ప్రధానంగా జబల్‌పూర్-కట్ని-సియోని వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది.  దీంతో ప్రయాగ్‌రాజ్ చేరుకునేందుకు అనేక మంది భక్తులకు ఎక్కువ సమయం పడుతుంది. పలు నివేదికల ప్రకారం 500 కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ జామ్‌ ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇది చరిత్రలోనే అతి పొడవైన ట్రాఫిక్ జామ్‌లలో ఒకటని చెబుతున్నారు.
 
కాగా, మహా కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొన్నారు. సోమవారం ఉదయం త్రివేణి సంగమం వద్ద ఆమె పుణ్యస్నానం ఆచరించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కుంభమేళాలో భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రయాగ్‌రాజ్‌ చేరుకున్న రాష్ట్రపతికి ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్‌ పటేల్‌, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్వాగతం పలికారు. తర్వాత వారితో కలిసి ద్రౌపదీ ముర్ము బోటులో పర్యటించారు. 
 
మార్గమధ్యంలో వలస పక్షులకు ఆమె ఆహారం అందించారు. అనంతరం త్రివేణి సంగమం వద్దకు చేరుకుని, పుణ్యస్నానం ఆచరించి, పూజలు చేశారు. సోమవారం ఉదయమే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మహా కుంభమేళాను సందర్శించి పవిత్ర స్నానం చేశారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యుల కూడా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు.

శనివారం నుంచి లక్షలకొద్ది వాహనాలు ప్రయాగరాజ్‌ వైపు మళ్లడంతో త్రివేణి సంగమం వద్ద స్నానాలకు సమయానికి వెళ్లలేకపోతున్నందుకు యాత్రికులంతా అసహనాన్ని వ్యక్తం చేశారు. జనాల తాకిడి ఎక్కువ కావడంతో ప్రయాగరాజ్‌ సంగమం రైల్వే స్టేషన్‌ను అధికారులు శుక్రవారం వరకు మూసివేశారు. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే మార్గాల్లో గంటల కొద్ది ట్రాఫిక్‌ జామ్‌, రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది యాత్రికులు తిరిగి తమ ఇండ్లకు వెళ్లిపోవాలని కోరారు. అప్పటికే వాహనాలన్నీ ఒకేచోట కిక్కిరిసి ఉండటంతో ముందుకు వెళ్లలేక, వెనక్కు తిరగలేక ఆ వాహనాల్లోనే 11 గంటలపాటు ఆపసోపాలుపడ్డారు. 

ఈ నేపథ్యంలో  ప్రయాగ్‌రాజ్‌ నుంచి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధ్యప్రదేశ్‌ నగరమైన కట్నిలో ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించవద్దని పోలీసు అధికారులు ప్రజలకు సూచించారు. అయితే ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళా సందర్శన కోసం వెళ్ళే వారు ఈ ట్రాఫిక్ పరిస్థితులను ముందుగా తెలుసుకుని వెళ్లాలని సూచిస్తున్నారు.  ట్రాఫిక్ రద్దీ, రహదారి మూసివేత మార్గాల గురించి రియల్ టైమ్ అప్‌డేట్‌లు తెలుసుకోవడం ద్వారా సులభంగా  గమ్యానికి చేరుకోవచ్చు.

రియల్ టైమ్ అప్‌డేట్‌

ప్రస్తుతం గూగుల్ మ్యాప్స్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ పరికరాల్లో అందుబాటులో ఉంది. ఇది రియల్-టైమ్ ట్రాఫిక్ అప్‌డేట్‌లను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీని ద్వారా మీరు రోడ్లలో రద్దీని గమనించి, వేగవంతమైన మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఈ యాప్ ట్రాఫిక్ పరిస్థితిని రంగు కోడెడ్ సిస్టమ్ ద్వారా మనకు అందిస్తుంది.

  • ఆయా ప్రాంతాల్లో ఎరుపు ఉంటే భారీ ట్రాఫిక్ ఉందని అర్థం. ఈ ప్రాంతాల్లో మీ ప్రయాణం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలి. లేదంటే ఇబ్బంది పడతారు.
  • మీకు పసుపు రంగు కనిపిస్తే, ఆయా చోట్ల రద్దీ కాస్తా తక్కువగా ఉందని చెప్పవచ్చు.
  • ఆయా ప్రాంతాల్లో మీకు గ్రీన్ రంగు కనిపిస్తే మీరు సాఫీగా రోడ్లపై ప్రయాణించవచ్చు. ఈ మార్గం మీకు సులభ ప్రయాణాన్ని అందిస్తుంది.

ఇలా చెక్ చేసుకోండి

గూగుల్ మ్యాప్స్‌తో మీ ట్రాఫిక్‌ను ఇలా నావిగేట్ చేసుకోండి. ఈ క్రమంలో మీరు గూగుల్ మ్యాప్స్ ద్వారా ఖచ్చితమైన ట్రాఫిక్ స్థితిని తెలుసుకుని, ఈజీగా మీ గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు.

  • ముందుగా గూగుల్ మ్యాప్స్ యాప్‌ ఓపెన్ చేయండి
  • తర్వాత మీ ప్రస్తుత స్థానం, గమ్యస్థానం నమోదు చేయండి
  • ఆ క్రమంలో గూగుల్ మ్యాప్స్ రియల్ టైమ్ ట్రాఫిక్ అప్‌డేట్‌లను, ప్రత్యామ్నాయ మార్గాలను చూపిస్తుంది
  • అప్పుడు మీ మార్గం మ్యాప్‌లో రంగు కోడెడ్ ట్రాఫిక్ సూచికలను చూడవచ్చు
  • మీ మార్గం రెడ్ కలర్లో ఉంటే, ప్రయాణం కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాలి

144 ఏళ్లకోసారి వచ్చే ఈ మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభమయ్యింది. భారత్‌తోపాటు విదేశాల నుంచి భారీసంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. ఫిబ్రవరి 26 వరకు ఈ వేడుక జరగనుంది. ఇప్పటివరకు పలువురు రాజకీయ, సినీ, వ్యాపారరంగాలతో పాటు పలువురు ప్రముఖులు, సామాన్య పౌరులు కలిపి 44 కోట్ల మంది పుణ్యస్నానం ఆచరించారని యూపీ ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.

ప్రయాగ్​రాజ్​కు వెళ్లే జబల్​పుర్-రేవా రహదారిపై దాదాపు 350 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్​ ఏర్పడింది. భారతదేశ చరిత్రలో ఇంతలా రోడ్లపై వాహనాలు నిలిచిపోవడం చాలా అరుదు. ఇప్పటికి ప్రపంచంలో అతిపెద్ద ట్రాఫిక్​ జామ్​ చైనా పేరిట ఉంది. చైనా రాజధాని బీజింగ్​లో 2010లో 100 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదాపు 12 రోజుల పాటు ప్రజలు అప్పుడు ట్రాఫిక్​లో ఇరుక్కున్నారు. ఇది గిన్నీస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​లోకి కూడా ఎక్కింది. 2012లో బ్రెజిల్​లోని సావోల పాలోలో 300 కిలోమీటర్లు జామ్​ అయిన ట్రాఫిక్​లో వాహనదారులు 12-15 గంటలు చిక్కుకుపోయారు.