క్రిమినల్‌ కేసులుంటే ప్రజాప్రతినిధులుగా ఎలా అర్హులు?

క్రిమినల్‌ కేసులుంటే ప్రజాప్రతినిధులుగా ఎలా అర్హులు?
‘క్రిమినల్‌ కేసులుంటే ఉద్యోగంలో చేరడానికే అనర్హులు .. అలాంటిది ప్రజాప్రతినిధులుగా ఎలా అర్హులవుతారు ?’ అని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రజాప్రతినిధుల కేసుల వేగవంతంపై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరిగింది.
 
 క్రిమినల్‌ కేసుల్లో దోషులుగా తేలిన నేతలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ అశ్వినీ ఉపాధ్యాయ 2016లో దాఖలు చేసిన పిల్‌పై జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ మన్మోహన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. అమికస్‌ క్యూరీ విజయ హన్సారియా సమర్పించిన నివేదికను ధర్మాసనం పరిశీలించింది. 
 
42 మంది లోక్‌సభ ఎంపీలపై క్రిమినల్‌ కేసులున్నాయని, కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులపై 30 ఏళ్లుగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అమికస్‌ క్యూరీ తన నివేదికలో పేర్కొన్నారు. దేశంలో చాలా చోట్ల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు లేవని తెలిపారు. నిందితులు ఏళ్లుగా విచారణకు రాకపోవడం, పదేపదే వాయిదాలు కోరుతుండటం జాప్యానికి మరో కారణమని నివేదికలో పొందుపరిచారు. 
 
దీనిపై సర్వోన్నత న్యాయస్థానం స్పందిస్తూ క్రిమినల్‌ కేసులుంటే ఉద్యోగంలో చేరడానికే అనర్హులని, అలాంటిది ప్రజాప్రతినిధులుగా ఎలా అర్హులవుతారు ? అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం మరింత పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, దానికనుగుణంగా ఉన్నత పరిష్కారం ఆలోచించాలని సూచించింది. 
 
సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయకపోవడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది.