మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా

మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా

జాతి ఘర్షణలతో అట్టుడికిన రెండేళ్ల అనంతరం మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌.బీరేన్‌ సింగ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఆదివారం తన రాజీనామా లేఖను ఆ రాష్ట్ర గవర్నర్‌ అజయ్ భల్లాకు ఆయన అందజేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమైన అనంతరం బీరెన్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆయన వెంట బీజేపీ, ఎన్‌పీఎఫ్ పార్టీలకు చెందిన 14 మంది ఎమ్మెల్యేలు, మణిపుర్ రాష్ట్ర బీజేపీ చీఫ్ ఎ.శారద, పార్టీ సీనియర్ నేత సంబిత్ పాత్ర ఉన్నారు. ఫిబ్రవరి 10 నుంచి మణిపుర్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సెషన్‌లో బీరెన్ సింగ్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామని కాంగ్రెస్ పార్టీ శుక్రవారం  ప్రకటించింది.

ఈ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు శనివారం  అధికార ఎన్‌డీఏ కూటమి ఎమ్మెల్యేలతో బీరేన్ సింగ్ ముఖ్యమంత్రి సచివాలయంలో భేటీ అయ్యారు. బీజేపీ పెద్దల నుంచి పిలుపు రావడం వల్ల ఆదివారం ఉదయం బీరేన్ సింగ్ హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బిజెపి అధ్యక్షులు జెపి నడ్డలతో భేటీ అయ్యారు. 

డిల్లీ నుంచి ఇంఫాల్‌కు తిరిగి వచ్చిన వెంటనే బీరేన్ సింగ్ నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి, గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు రాజీనామా లేఖను అందించారు. మణిపుర్ అసెంబ్లీ సెషన్‌కు సరిగ్గా ఒకరోజు ముందు ఈ పరిణామం జరగడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.

బీరెన్ సింగ్ తన రాజీనామా లేఖలో కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఇన్నేళ్ల పాటు మణిపుర్ ప్రజలకు సేవ చేసినందుకు గర్విస్తున్నట్లు చెప్పారు. తనకు ఈ గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటానని ఆయన తెలిపారు. మణిపుర్ అభివృద్ధి కోసం తన హయాంలో చేపట్టిన చాలా ప్రాజెక్టులకు కేంద్ర సర్కారు నుంచి పూర్తి సహకారం లభించిందని పేర్కొన్నారు.

కొంత కాలంగా మణిపూర్‌లో అల్లర్లు జరుగుతోన్నాయి. దీంతో సీఎం బీరెన్ సింగ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. 2023, మే మాసంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్‌లో రెండు తెగలు- మైతేయి, కూకీ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో దాదాపు 300 మంది మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. లక్షలాది మంది ప్రాణ భయంతో ఇతర ప్రాంతాలకు తరలిపోయారు. 

ఆ నాటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులు పూర్తిగా క్షీణించాయి. అలాంటి వేళ ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీరెన్ సింగ్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు సైతం వెల్లువెత్తాయి. అనంతరం ఆ ప్రభుత్వానికి పలు పార్టీలు తమ మద్దతును ఉపసంహరించుకొన్నాయి.  అయినా మణిపూర్‌లో బీజేపీకి ఎమ్మెల్యేల సంఖ్య బలం బాగానే ఉంది. 

దీంతో ఆ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. అయితే ముఖ్యమంత్రి బీరెన్ సింగ్‌ను మార్చాలంటూ ఆ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే న్యూఢిల్లీలోని అగ్రనాయకత్వానికి వరుస లేఖలు సంధించారు.  ఇటీవల మిత్రపక్షమైన కొన్రాడ్‌ సంగ్మా నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పిపి) మద్దతు ఉపసంహరించుకుంది.  స్పీకర్‌, ముఖ్యమంత్రిల మధ్య విభేదాలు కూడా మరో కారణమని భావిస్తున్నారు.