మోహన్ భగవత్ ను కలిసిన ఆర్‌జి కర్ బాధితురాలి తల్లితండ్రులు

మోహన్ భగవత్ ను కలిసిన ఆర్‌జి కర్ బాధితురాలి తల్లితండ్రులు
పశ్చిమ బెంగాల్‌లో తన 10 రోజుల పర్యటనలో భాగంగా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ శనివారం కోల్‌కతాలో ఆర్‌జి కర్ అత్యాచారం, హత్య కేసులో బాధితురాలి తల్లిదండ్రులను కలిసి వారికి  న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.
 
సమావేశం గురించి బాధితురాలి తండ్రి మాట్లాడుతూ, “మేము ఉదయం 11 గంటలకు ఆయనను కలిశాము. అరగంట పాటు సమావేశం నిర్వహించాము. కేసు తనకు తెలుసునని, కానీ దాని లోతుపాతులు తనకు తెలియవని చెప్పారు. దానిని పరిశీలించి మాకు న్యాయం జరిగేలా చూస్తానని ఆయన భరోసా ఇచ్చారు” అని చెప్పారు.
 
దారుణమైన ఈ నేరంలో పాల్గొన్నట్లు అనుమానిస్తున్న వ్యక్తుల పేర్లను పేర్కొంటూ తల్లిదండ్రులు ఆయనకు ఒక లేఖ కూడా ఇచ్చారు. “మేము ఆయనకు ఒక లేఖ ఇచ్చాము. మేము అనుమానిస్తున్న వ్యక్తుల పేర్లను ప్రస్తావించాము. మేము ఆయనను విశ్వసిస్తాము. న్యాయం కోసం అప్పీల్ చేసుకునే అవకాశాన్ని మేము వదిలిపెట్టము” అని బాధితురాలి తండ్రి పేర్కొన్నారు. 
 
ముఖ్యంగా, ఈ కేసులో ఆగస్టు 9, 2024న ఆర్‌జి కర్ హాస్పిటల్ సెమినార్ గదిలో ఒక ట్రైనీ వైద్యురాలి మృతదేహం కనుగొన్నారు. అత్యాచారం, హత్యకు సంబంధించిన కేసుగా గుర్తించారు.  జనవరి 30న బాధితురాలి తల్లిదండ్రులు పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద బోస్‌ను కలిసి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల ద్వారా తమ ఫిర్యాదులకు పరిష్కారం చూడాలని ఆయనను కోరారు. 
 
ఈ సమావేశం గురించి రాజ్ భవన్ మీడియా సెల్ పోస్ట్ చేసింద: “30.01.2025న ఆర్.జి.కార్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ బాధితురాలి తల్లిదండ్రులు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు తమ ఫిర్యాదులను వివరించి న్యాయం కోసం వేడుకున్నారు.” “గౌరవనీయులైన భారత రాష్ట్రపతి, గౌరవనీయులైన కేంద్ర హోంమంత్రిలతో తమ కేసును పరిష్కరించాలని వారు ఆయనను అభ్యర్థించారు.” 
 
వారికి వారు ఇప్పటికే తమ ఫిర్యాదులను సమర్పించారు. ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకుంటామని గవర్నర్ వారికి హామీ ఇచ్చారు. వారిని గవర్నర్ శాంతింపజేసి, తమ దుఃఖంలో వారు ఒంటరిగా లేరని, మానవత్వం వారికి అండగా ఉంటుందని, న్యాయం గెలుస్తుందని భరోసా ఇచ్చారు.  కాగా, జనవరి 20న, సీల్దా సివిల్, క్రిమినల్ కోర్టు ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు విధించింది. ట్రయల్ కోర్టు తీర్పు తర్వాత దోషికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చెలరేగాయి.