ఓయూలో ఉద్రిక్తత.. కాకతీయ వర్సిటీలో ఘర్షణ!

ఓయూలో ఉద్రిక్తత.. కాకతీయ వర్సిటీలో ఘర్షణ!
ఉస్మానియా యూనివర్సిటీలో శుక్రవారం అర్ధరాత్రి వరకు ఉద్రిక్తత నెలకొంది. సెమిస్టర్‌ను వాయిదా వేయాలని సైన్స్‌ విద్యార్థులు అడ్మిన్‌ బిల్డింగ్‌ను ముట్టడించారు. ఈ నెల 18 నుంచి మెదటి, మూడవ సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. అదే సమయంలో పలు పోటీ పరీక్షలు ఉండడంతో ఈ సెమిస్టర్స్‌ను వాయిదా వేయాలని రెండు రోజులుగా విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. 
 
అధికారులు పట్టించుకోకపోవడంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆందోళనను ఉధృతం చేశారు.  పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. సిలబస్ పూర్తవకుండానే పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.  మరోవైపు, సీఎస్ఐఆర్ నెట్ పరీక్ష పూర్తయ్యే వరకు మినహాయింపు ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పరీక్షల వాయిదాపై యూనివర్సిటీ రిజిస్ట్రార్‌తో మాట్లాడినా ఫలితం లేకపోయిందని విద్యార్థులు చెబుతున్నారు.
కాగా, కాకతీయ యూనివర్సిటీలో శుక్రవారం జూనియర్, సీనియర్ విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తమకు గౌరవం ఇవ్వడం లేదంటూ జూనియర్ విద్యార్థులతో సీనియర్లు గొడవకు దిగడంతో వివాదం మొదలైంది. ఎమ్మెస్సీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు తమకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదంటూ సెకండియర్ విద్యార్థులు శుక్రవారం మధ్యామ్నం లంచ్ సమయంలో వారిని గట్టిగా హెచ్చరించారు. 
 
ఈ క్రమంలో జూనియర్లంతా ఏకమై సీనియర్లపై గొడవకు దిగారు. ఆ తర్వాత అన్నం తినే ప్లేట్లతో ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. దీంతో క్యాంటీన్ పరిసరాలు రణరంగంగా మారాయి. ఈ ఘర్షణలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు యూనివర్సిటీకి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. గొడవపై విచారణ జరిపి ఘర్షణకు కారణమైన పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.