విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు

విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పడ్డ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ జరుగదని కేంద్ర ఉక్కు గనులశాఖ మంత్రి కుమారస్వామి మరోసారి స్పష్టం చేశారు. ప్లాంట్‌ను పునరుద్దరించడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు.

ఇటీవల కేంద్రం విశాఖ స్టీల్‌కు ప్యాకేజీ ప్రకటించిన అనంతరం తొలిసారిగా విశాఖకు వచ్చిన మంత్రి కుమారస్వామితో పాటు మరో మంత్రి శ్రీనివాస వర్మకు ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు నుంచి ర్యాలీని నిర్వహించారు. అనంతరం ఇద్దరు మంత్రులు, ఎంపీలు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను సందర్శించారు.

దాదాపు నాలుగు గంటలకు పైగా సంబంధిత అధికారులు, కార్మికులు, ఉద్యోగులతో సమావేశం నిర్వహించి ప్యాకేజీతో ప్లాంట్‌ సమర్ధ నిర్వహణ అనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కుమార స్వామి మాట్లాడారు. 2030లోపు విశాఖ ప్లాంట్‌ 300 మిలియన్‌ టన్నుల స్టీల్‌ ఉత్పత్తి సాధించాలని ప్రధాని నరేంద్ర మోదీ తమకు లక్ష్యంగా నిర్దేశించారని వివరించారు. ప్రస్తుతం రూ. 35వేల కోట్ల అప్పులుగా ఉన్న ప్లాంట్‌ను పరిరక్షించేందుకు తాము అధికారంలోకి రాగానే రెండు విడతలుగా ఆర్థిక సహాయం అందజేసామని తెలిపారు.

విశాఖ స్టీల్ ప్లాంట్‌ సాధన కోసం సుమారు 30 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. స్టీల్ ఫ్యాక్టరీ మొదట్లో ఉత్పత్తి బాగా ఉండేదని, 2013-14 వరకు పనితీరు బాగానే ఉందని పేర్కొన్నారు. అయితే, 2014లో నవరత్న హోదా సాధించిన తర్వాత ఉక్కు ఉత్పత్తి పెంచాలని నిర్ణయించినప్పటి నుంచి నష్టాల్లోకి వెళ్లిందని వెల్లడించారు.

జులైలో ప్లాంట్‌ను సందర్శించిన తరువాత ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడం లేదని, పునరుద్దరించడానికి చర్యలు తీసుకుంటామన్న హామీకి కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. మొదటి, రెండు విడతలుగా విడుదల చేసిన నిధులతో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ మొదలు పెట్టాం, దీంతో ఉద్యోగులు, కార్మికులు సమర్దవంతంగా పనిచేయడంతో కేంద్రం మరో రూ. 11,440 కోట్లు ప్యాకేజీ ఇచ్చిందని చెప్పారు. 

ఇచ్చిన నిధులను ఏ విధంగా ఖర్చు చేసి స్టీల్ ప్లాంట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి గురువారం సందర్శించామని తెలిపారు. వచ్చే జూన్‌, జులైలో మూడో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ను ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

ప్రపంచ ఉక్కు ఉత్పత్తిలో ప్రస్తుతం భారత్ రెండో స్థానంలో ఉందని చెబుతూ .విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలోని కార్మికుల సమస్యలను 3 నెలల్లో పరిష్కరిస్తామని కేంద్రమంత్రి కుమారస్వామి వివరించారు. ఏపీ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, ఎంపీలు భరత్‌, కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులు కూడా పాల్గొన్నారు.