కుంభ మేళ సమన్వయం కోసం ఐదుగురు ప్రత్యేక అధికారులు

కుంభ మేళ సమన్వయం కోసం ఐదుగురు ప్రత్యేక అధికారులు

మహాకుంభమేళలో మౌని అమావాస్యనాడు జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సర్కార్ అప్రమత్తం అయ్యింది. భక్తుల రద్దీ, ట్రాఫిక్, పలు శాఖల మధ్య సమన్వయం కుదిర్చేందుకు ఐదుగురు ప్రత్యేక అధికారులను నియమించింది. ఈ మేరకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పలు మార్గదర్శకాలను జారీ చేస్తూ ఓ ప్రకటనను విడుదల చేశారు.

“ట్రాఫిక్, భక్తుల రద్దీ, పలు శాఖల మధ్య సమన్వయాన్ని పర్యవేక్షించడానికి ఐదుగురు ప్రత్యేక కార్యదర్శి స్థాయి అధికారులను నియమించాం. వీరు కుంభమేళాలో ఏర్పాట్లను పర్యవేక్షించడానికి ఫిబ్రవరి 12 వరకు ప్రయాగ్రాజ్లో ఉంటారు. అలాగే మెరుగైన భద్రత కోసం పోలీసు సూపరింటెండెంట్ స్థాయి అధికారులను కూడా మోహరిస్తాం” అని తెలిపారు. 

2019 కుంభమేళా సమయంలో ప్రయాగ్రాజ్ డివిజనల్ కమిషనర్గా పనిచేసిన ఆశిశ్ గోయల్, ఏడీఏ మాజీ వైస్ ఛైర్మన్ భాను గోస్వామిని ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు నియమించారు.  మహా కుంభమేళా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పోలీసు డైరెక్టర్ జనరల్ను ఆదేశించారు. 

వసంత పంచమికి ఏర్పాట్లు చేయాలని, భద్రత, ప్రజా సౌకర్యానికి సంబంధించిన ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని కోరారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రయాగ్రాజ్, కౌశాంబి, వారణాసి, అయోధ్య, మీర్జాపుర్, బస్తీ, జౌన్పుర్, చిత్రకూట్, బండా, అంబేద్కర్‌ నగర్, ప్రతాప్‌గఢ్, సంత్ కబీర్ నగర్, భదోహ్, రాయబరేలి, గోరఖ్పుర్కు చెందిన సీనియర్ పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటన జరిగిన నేపథ్యంలో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ అప్రమత్తమయ్యారు. మహా కుంభమేళాకు భక్తులు వచ్చే సమయంలో ఎంపీ-యూపీ సరిహద్దు వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో రేవా డివిజన్ ప్రధాన కార్యదర్శి, కమిషనర్ను భక్తుల భద్రత కోసం సరైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

“మహా కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమం వద్ద విషాద సంఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. మరణించిన వారిలో ముగ్గురు మధ్యప్రదేశ్‌కు చెందినవారని నాకు సమాచారం అందింది” అని మోహన్ యాదవ్ పేర్కొన్నారు.

మహాకుంభమేళాలో తొక్కిసలాట నేపథ్యంలో యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వీవీఐపీ పాస్‌లను పూర్తిగా రద్దు చేసింది. భక్తుల రద్దీని నియంత్రించేందుకు మహా కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలోకి ఎలాంటి వాహనాలు ప్రవేశించకుండా  ఈ ప్రాంతాన్ని నో వెహికల్‌ జోన్‌గా ప్రకటించారు.  వాహనాల ఎంట్రీకి ఎలాంటి మినహాయింపులు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే వీవీఐపీ, స్పెషల్‌ పాస్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

ప్రయాగ్‌రాజ్‌ పొరుగునున్న జిల్లాల నుంచి వచ్చే వాహనాలను సరిహద్దుల వద్దే నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాహనాల రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఫిబ్రవరి 4వ తేదీ వరకు ప్రయాగ్‌రాజ్‌ నగరంలోకి ఫోర్‌ వీలర్‌ వాహనాలు ప్రవేశించకుండా నిషేధం విధించామని ప్రభుత్వం పేర్కొంది. భక్తుల సౌకర్యార్థం కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో వన్‌-వే రూట్‌ ట్రాఫిక్‌ వ్యవస్థను అమల్లోకి తెస్తున్నట్లు యూపీ సర్కార్ తెలిపింది.

మరోవంక, ఒడిశా ప్రభుత్వం మహా కుంభమేళా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు సర్వీసులను ఫిబ్రవరి 4 వరకు రద్దు చేసింది. అనివార్య పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ఉత్తర్వులో పేర్కొంది. మహా కుంభమేళా, అయోధ్యకు వెళ్లే ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు సర్వీసులను ఫిబ్రవరి 4 వరకు తక్షణమే రద్దు చేస్తున్నట్లు ఒడిశా ఆర్టీసీ తెలిపింది.