అత్యాచారం కేసులో కాంగ్రెస్ ఎంపీ అరెస్ట్

అత్యాచారం కేసులో కాంగ్రెస్ ఎంపీ అరెస్ట్
మహిళపై అత్యాచారం కేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాకేశ్‌ రాథోడ్‌ అరెస్టయ్యారు. బుధవారం రాకేశ్‌ అలహాబాద్ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేయగా బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశించింది. అంతకుముందు సీతాపూర్‌ లోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో కూడా రాకేశ్‌ ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ వేశారు. అక్కడ కూడా ఆయనకు నిరాశే ఎదురైంది.

అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాల మేరకు గురువారం ఉదయం ఓ మీడియా సమావేశంలో ఉండగా రాకేశ్‌ రాథోడ్‌ను పోలీసుల అరెస్ట్‌ చేశారు. రాకేశ్‌ రాథోడ్‌ గత లోక్‌సభ ఎన్నికల్లో సీతాపూర్‌ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు. 

ఈ క్రమంలో రాకేశ్‌ రాథోడ్‌ పెళ్లి చేసుకుంటానని, రాజకీయ భవిష్యత్తు ఇస్తానని మాయ మాటలు చెప్పి గత నాలుగేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని బాధితురాలు ఈ నెల 17న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ రాకేశ్‌ రాథోడ్‌కు, తనకు మధ్య ఫోన్‌ కాల్‌ వివరాలను, కాల్‌ రికార్డింగులను కూడా ఆమె పోలీసులకు అందజేశారు. పోలీసులు ఎంపీపై కేసు నమోదు చేశారు. 

దాంతో ఆయన ముందస్తు బెయిల్‌ కోసం ఈ నెల 23న ఎంపీ ఎమ్మెల్యే కోర్టును, బుధవారం అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్‌ దొరకకపోవడంతో ఇవాళ పోలీసుల ఎదుట లొంగిపోయారు. గతవారం బాధితురాలి భర్త కూడా పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు. కేసును వాపస్‌ తీసుకోవాలని ఎంపీ, ఆయన కుమారుడు ఒత్తిడి చేస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.