కేంద్ర మంత్రి కుమారస్వామి నేడే విశాఖ స్టీల్ ప్లాంట్ సందర్శన

కేంద్ర మంత్రి కుమారస్వామి నేడే విశాఖ స్టీల్ ప్లాంట్ సందర్శన

రాష్ట్రీయ ఇస్పాత్ నిగామ్ లిమిటెడ్‌ (ఆర్ఐఎన్ఎల్)కు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం ప్రకటించిన అనంతరం విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమార స్వామి సందర్శించేందుకు గురువారం వస్తున్నారని ఆ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు సంకల్పంతో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సాధ్యమైందని ఆవమా స్పష్టం చేశారు.

సమిష్టి కృషి ద్వారా ప్లాంట్‌కి ప్యాకేజీ తెచ్చినట్లే.. సమిష్టిగా పని చేసి ప్లాంట్‌ను లాభల్లోకి తీసుకు రావాల్సిన అవసరం ఉందని చెబుతూ స్టీల్ ఉత్పత్తిని పెంచాలంటూ ప్రధాని మోదీ లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. దేశంలో 2030 నాటికి 300 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తికి పెంచాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యంగా నిర్దేశించుకొన్నారని గుర్తు చేశారు. 

విశాఖ స్టీల్ ప్లాంట్‌కి ఇచ్చిన ప్యాకేజీని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. గత మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలని చెల్లించే అంశంపై తాను, కుమార స్వామి ఆలోచన చేస్తున్నామని చెప్పారు.అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తారన్న ఆలోచన ఎవరు చేయవద్దంటూ కార్మికులకు సూచించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతోందని ఎవరు చెప్పిన నమ్మొద్దంటూ ప్రజలకు ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు. 

అయితే స్టీల్ ప్లాంట్‌కి రూ. 35 వేల కోట్లు మేర బకాయిలుగా ఉన్నాయని, అంటులో రూ.18 వేల కోట్లు బ్యాంకులకు, మెటీరియల్ సప్లై చేసిన వారికి రూ. 17 వేల కోట్ల ఉన్నాయని గుర్తుచేశారు. రూ. 11,440 కోట్లతో స్టీల్ ప్లాంట్ వినియోగంలోకి తీసుకువచ్చి నష్టాలు పూడ్చే పని మొదలు పెట్టాల్సి ఉందని,  అందుకోసం తొలుత ప్లాంట్ గాడిన పడాల్సి ఉందని చెప్పారు.

ఈ ఏడాది ఆగస్టు నాటికి మూడు బ్లాస్ట్ ఫర్నిస్‌లు పని చేయలనేది కేంద్రం  ఆలోచన అని ఆయన తెలిపారు. ఉత్పత్తి సామర్థ్యం పెరిగిన అనంతరం నష్టాల నుంచి బయటకు వచ్చిన తరువాత ఏం చేయాలనే దానిపై కేంద్రం ఆలోచన చేస్తుందని చెప్పారు. సెయిల్‌లో స్టీల్ ప్లాంట్ విలీనం కష్టతరమైన అంశమని పేర్కొంటూ నష్టాల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ సంస్థ విలీనాన్ని పరిశీలిస్తామని సెయిల్ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారని చెప్పారు.

సెయిల్‌లో 65 శాతం ప్రభుత్వ వాటా కాగా, మిగిలిన 35 శాతం పబ్లిక్ వాటా ఉందని గుర్తు చేశారు. సెయిల్‌లో స్టీల్ ప్లాంట్ విలీన ప్రక్రియకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, అయితే సెయిల్‌లో స్టీల్ ప్లాంట్ విలీనానికి తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.  స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు తన శాయశక్తులా కృషి చేస్తానని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ఏపీ ప్రజలకు హామీ ఇచ్చారు. 

స్టీల్ ప్లాంట్‌లో రూ. 240 కోట్ల వేతన బకాయిలు ఉన్నాయని చెప్పారు. గతేడాది అక్టోబర్ వరకు జీతాలు చెల్లించామని, అనంతరం 50 శాతం, 30 శాతం జీతాలు చెల్లిస్తున్నామని వివరించారు. అయితే కార్మికుల జీతాల చెల్లింపు తమ మొదటి ప్రాధాన్యత అని తెలిపారు.