తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. రెండు రాష్ట్రాల్లో మెుత్తం ఆరు స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు. ఫిబ్రవరి 3న ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు చెప్పింది. ఫిబ్రవరి 3 నుంచి 10 వరకూ నామినేషన్ల స్వీకరించనున్నట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 11న స్క్రూటినీ నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఏపీలో మరో రెండు నెలల్లో ఖాళీ కానున్న రెండు పట్టభద్రులు, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఉభయగోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా నియోజకవర్గాల్లో రెండు పట్టభద్రుల స్థానాలకు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలోని ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.
ప్రస్తుతం ఏపీలోని పట్టభద్రుల స్థానాలకు ఐలా వెంకటేశ్వరరావు, కెఎస్ లక్ష్మణారావు, టీచర్ ఎమ్మెల్సీగా పాకాలపాటి రఘువర్మ కొనసాగుతున్నారు. ఈ ముగ్గురి పదవికాలం మార్చి 29తో ముగుస్తుంది. ఈ స్థానాలను , భర్తీ చేసేందుకు గాను ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేసింది.
తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ స్థానానికి, మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ ఉపాధ్యాయ స్థానానికి, మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక ఈ జిల్లాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.
మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి ప్రస్తుతం జీవన్ రెడ్డి(కాంగ్రెస్) కొనసాగుతున్నారు. మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ టీచర్ స్థానం నుంచి కూర రఘోత్తం రెడ్డి, వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ స్థానం నుంచి అలుగుబెల్లి నర్సి రెడ్డి కొనసాగుతున్నారు.
ఈ ముగ్గురి పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది. ఇప్పటికే బిజెపి మూడు స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్, బిఆర్ఎస్ ఇంకా ప్రకటించలేదు. కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ల స్థానంకు మాత్రమే పోటీ చేయనున్నట్లు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
More Stories
మహిళా మోర్చా ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం
అమెరికాలో పోలీసు కాల్పుల్లో తెలంగాణ టెక్కీ మృతి!
నిజమైన హైదరాబాద్ బస్తీల్లో ఉంది