జ్యోతి సురేఖకు `ఖేల్‌రత్న’ ఇవ్వలేదని నిలదీసిన హైకోర్టు

జ్యోతి సురేఖకు `ఖేల్‌రత్న’ ఇవ్వలేదని నిలదీసిన హైకోర్టు
ప్రముఖ ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ పతకాలు సాధించినప్పటికీ ఖేల్‌రత్న అవార్డు ఎంపికలో ఆమెను విస్మరించారని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు తప్పుపట్టింది. అవార్డుకు ఎంపికైన వారికంటే సురేఖకు ఎక్కువ పాయింట్లు ఉన్నాయని తేల్చిచెప్పింది.  అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డును జ్యోతి సురేఖకు ఇచ్చే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర క్రీడల, యువజన మంత్రిత్వశాఖ, ఎంపిక కమిటీలను ఆదేశించింది.

2023, 2024 సంవత్సరాలకు ఖేల్‌రత్న అవార్డుకు ఇప్పటికే ఎంపికైన క్రీడాకారులతోపాటు జ్యోతి సురేఖ పేరును పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. పిటిషనర్‌ నుంచి ఈ విషయంలో తాజాగా దరఖాస్తు కోరవద్దని స్పష్టం చేసింది. 2024 సైతం ముగిసిన నేపథ్యంలో 2023లో ఖేల్‌రత్న అవార్డుకు ఎంపికలను ఈ దశలో రద్దు చేయడం సరికాదని అభిప్రాయపడింది. 

 
ఖేల్‌ రత్న పురస్కారానికి ప్రతిభావంతులైన క్రీడాకారులను ఎంపిక చేసేందుకు మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్ర క్రీడలు, యువజన శాఖ కార్యదర్శిని ఆదేశించింది. సెలక్షన్‌ కమిటీకే విచక్షణాధికారాన్ని వదిలేయకుండా, ఎలాంటి అస్పష్టతకు తావివ్వకుండా మార్గదర్శకాలు, నిబంధనల మేరకు కట్టుబడి ఉండేలా చూడాలని స్పష్టం చేసింది. 
 
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు. ఖేల్‌ రత్న అవార్డుకు తన పేరును పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంతర్జాతీయ ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ గతేడాది జనవరిలో హైకోర్టులో వ్యాజ్యం వేశారు.
 
ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి ఖేల్‌ రత్న అవార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికంటే జ్యోతి సురేఖకు ఎక్కువ పాయింట్లు (148.74) ఉన్నాయని తేల్చిచెప్పారు. అవార్డుకు ఎంపికైన సాత్విక్‌ సాయిరాజ్, చిరాగ్‌ చంద్రశేఖర్‌ శెట్టి (58.5 పాయింట్ల) కంటే సురేఖ ఎక్కువ పాయింట్లు పొందారు. ఆమెకు అవార్డు ఇవ్వకపోవడానికి కారణాలను పేర్కొనలేదు. 
 
పిటిషనర్‌ ఎంపిక కమిటీకి దురుద్దేశాలు ఆపాదిస్తూ బురదజల్లేందుకు ప్రయత్నం చేయలేదు. అవార్డు ఎంపిక ప్రక్రియ జాతీయ క్రీడా కోడ్‌కు విరుద్ధంగా ఉందని మాత్రమే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యాజ్యానికి విచారణ అర్హత ఉంది. అవార్డు ఎంపికకు దరఖాస్తులను ఆహ్వానించేటప్పుడు చేసిన వాగ్దానానికి విరుద్ధంగా ఎంపిక కమిటీ వ్యవహరించింది. 
 
సెలక్షన్‌ కమిటీ కేవలం విచక్షణ మేరకు ఓ క్రీడకు చెందిన వారినే ఖేల్‌రత్న అవార్డు కోసం ఎంపిక చేయడం ఎంపిక విధానానికి విరుద్ధం. ఒక ఏడాదిలో ఒక క్రీడలో ఒకటి కంటే ఎక్కువ మందికి పతకాలు ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి. 2023 ఖేల్‌రత్న అవార్డుకు ఎంపికైన క్రీడాకారులతో పాటు జ్యోతి సురేఖ పేరునూ పరిగణనలోకి తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర క్రీడలశాఖపై ఉందని న్యాయమూర్తి తీర్పులో స్పష్టం చేశారు.