తెలంగాణాలో సమ్మె నోటీసు ఇచ్చిన ఆర్టీసీ జేఏసీ

తెలంగాణాలో సమ్మె నోటీసు ఇచ్చిన ఆర్టీసీ జేఏసీ

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చింది. బస్‌ భవన్‌లో అధికారులకు కార్మిక సంఘం నేతలు సోమవారం సమ్మె నోటీసు ఇచ్చారు. గతంలో ప్రభుత్వం హామీలను అమలు చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నోటీస్​లో పేర్కొంది. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, 2 పీఆర్‌సీలు అమలు చేయాలని వారు స్పష్టం చేశారు. 

అలాగే సీసీఎస్, పీఎఫ్ డబ్బులు రూ.2,700 కోట్లు వెంటనే చెల్లించాలని కూడా వారు డిమాండ్‌ చేశారు. వీటిని నెరవేర్చకుంటే సమ్మెకు దిగుతామని కార్మిక సంఘాలు నోటీసుల్లో పేర్కొన్నాయి. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు భారీ ఎత్తున బస్‌ భవన్‌ వద్దకు రావడంతో పోలీసులను భారీ సంఖ్యలో మోహరించారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆర్టీసీ జాయింట్ యాక్షన్​ కమిటీ (జేఏసీ) ఆరోపణలు చేసింది.

ఎలక్ట్రిక్‌ బస్సుల కొనుగోలు, నిర్వహణను ప్రైవేటు కంపెనీలు చేస్తున్నాయని జేఏసీ అసహనం వ్యక్తం చేసింది. ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్​ చేసింది.  ట్రేడ్‌ యూనియన్లకు ఎన్నికలు నిర్వహించకుండా, యూనియన్లను రద్దు చేసి, కార్మికులకు పనిగంటలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాల డిమాండ్‌ చేశాయి.

ఈనెల 22న బుధవారం ఎంప్లాయీస్‌ యూనియన్‌ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్‌ ఈదురు వెంకన్న, వైస్‌ఛైర్మన్‌ థామస్‌రెడ్డి, కన్వీనర్‌ ఎండీ మౌలానా ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా, తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలుచేయలేదని వారు విమర్శించారు. 

ప్రైవేట్‌ సంస్థల ఎలక్ట్రిక్‌ బస్సుల పేరుతో కార్పొరేట్‌ సంస్థలకు ఆర్టీసీని కట్టబెడుతున్నారని ప్రధానంగా ఆరోపించారు. ఎలక్ట్రిక్​ బస్సుల కొనుగోలుకు ప్రభుత్వాలు ఆర్థిక చేయూతను అందించాలని, కార్పొరేట్‌ సంస్థలకు ఇస్తున్న రాయితీ, ప్రోత్సాహకాలను నేరుగా ఆర్టీసీకి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

కాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమను పట్టించుకోవడం లేదని.. తమ సమస్యలను పరిష్కరించడం లేదని ఆర్టీసీ కార్మికులు చెబుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోవడంపై ఆర్టీసీ కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సుల వల్ల ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని.. అలాగే ఆర్టీసీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన మహిళలకు ఉచిత బస్సు పథకం కారణంగా పనిభారం కూడా పెరిగిందని కార్మికులు వాపోతున్నారు.