వివేకానందరెడ్డి హత్య కేసులో కేంద్రం జోక్యం చేసుకోవాలి

వివేకానందరెడ్డి హత్య కేసులో కేంద్రం జోక్యం చేసుకోవాలి

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో వేగం పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరినట్లు జమ్మలమడుగు బిజెపి ఎమ్యెల్యే, మాజీ మంత్రి సి. ఆదినారాయణ రెడ్డి తెలిపారు. ఆరేళ్లవుతున్నా ఆ కేసులో పురోగతి లేదని, అసలు దోషులను తేల్చడానికి కేంద్రం జోక్యం చేసుకోవాలని తాను ఇటీవల అమిత్ షాకు విన్నవించినట్టు వెల్లడించారు. 

హత్య జరిగిన రోజు వివేకా గుండెపోటుతో చనిపోయాడనే విషయాన్ని విజయసాయిరెడ్డి చెప్పారని పేర్కొంటూ తాజాగా అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి మరో వ్యక్తి ఆ విషయం చెప్పాడని విజయసాయి రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. అవినాష్ రెడ్డి, విజయసాయిరెడ్డి అబద్ధాలను అందంగా అల్లుతున్నారని ఆరోపించారు. వివేకా హత్య కేసులో తమపై అనేక ఆరోపణలు చేశారని గుర్తు చేశారు.

 జగన్ మోహన్ రెడ్డి ఒంటెద్దు పోకడలను తట్టుకోలేకనే విజయసాయిరెడ్డి రాజ్యసభకు రాజీనామా చేసి బయటికి వచ్చారని ఆదినారాయణరెడ్డి తెలిపారు. జగన్ లండన్ నుంచి జగన్ ఇండియాకు తిరిగి వచ్చేలోపు చాలామంది ఆ పార్టీ నేతలు బయటికి వెళ్లిపోతారని ఆయన జోస్యం చెప్పారు. జగన్ బతిమాలినా విజయసాయిరెడ్డి పార్టీలో ఉండలేదంటే, ఆ పార్టీ అట్టడుగున ఉందనే విషయం గుర్తించుకోవాలని స్పష్టం చేశారు.

 వైఎస్సార్సీపీ నుంచి బయటికి వస్తే ఆ పార్టీ నాయకులకు దరిద్రం పోతుందని చెబుతూ  వైఎస్సార్సీపీలో ఉండలేక అనేకమంది ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. జగన్‌ లండన్‌ వెళ్తే ఆ పార్టీ నాయకులు అండర్‌గ్రౌండ్‌కు వెళ్తారని ఎద్దేవా చేశారు. జగన్‌ సంగతి పూర్తిగా తెలిసే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారని వ్యాఖ్యానించారు.

 చిన్నాన్నను నరికి చంపితే గుండెపోటు అని ప్రచారం చేశారని పేర్కొంటూ జగన్ లాంటి నేతలను వదిలించుకోవాలని ప్రజలను కోరుతున్నానని ఆయన చెప్పారు. వికసిత్ భారత్‌, స్వర్ణాంధ్ర దిశగా మనం అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లోకి నేరగాళ్లను రానీయవద్దని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. 

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అనేక రకాలుగా సహాయం చేస్తుందని తెలిపారు. అమరావతి, పోలవరం, రైల్వే జోన్‌, స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం అండగా ఉందని గుర్తు చేశారు. జగన్ తాను అధికారంలో ఉన్నప్పుడు పేదలకు ఇళ్లు కట్టలేదు కాని, తాను మాత్రం అనేక ప్యాలెస్‌లు కట్టుకుంటారని ఎద్దేవా చేశారు. జగన్‌ మాటలు విని ప్రజలంతా నవ్వుకుంటున్నారని చెప్పారు.