నాగేశ్వర్‌రెడ్డికి పద్మవిభూషణ్‌, బాలకృష్ణకు పద్మభూషణ్‌

నాగేశ్వర్‌రెడ్డికి పద్మవిభూషణ్‌, బాలకృష్ణకు పద్మభూషణ్‌
 
* 139 మందికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు
 
కేంద్ర ప్రభుత్వం శనివారం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులు ప్రకటించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ సారి మొత్తం 139 మందికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో ఏడుగురికి పద్మవిభూషణ్‌, 19 మందికి పద్మభూషణ్‌, 113 మందికి పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది.
 
తెలంగాణకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత జీర్ణ కోశ వ్యాధుల నిపుణుడు డాక్టర్‌ దువ్వూరు నాగేశ్వర్‌రెడ్డిని ఈ ఏడాది అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పద్మ విభూషణ్‌ వరించింది. తెలుగు చలనచిత్ర రంగానికి చెందిన ప్రముఖ నటుడు, శాసన సభ్యుడు బాలకృష్ణకు పద్మభూషణ్‌ పురస్కారం లభించింది. 
 
తెలంగాణకు చెందిన మాదిగ రిజర్వేషన్‌ ఉద్యమకారుడు మందకృష్ణ మాదిగ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రముఖ అవధాన విద్వాంసుడు మాడుగుల నాగఫణిశర్మ, ప్రముఖ విద్యావేత్త, రచయిత కేఎల్‌ కృష్ణ, కళారంగానికి చెందిన మిరియాల అప్పారావు(మరణానంతరం), విద్యారంగానికి చెందిన వాధిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖిలకు ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారాలు లభించాయి.

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జగదీశ్‌సింగ్‌ ఖెహర్‌, ఇటీవల మరణించిన ప్రముఖ మళయాళీ రచయిత వాసుదేవన్‌ నాయర్‌, ప్రముఖ వయోలిన్‌ విద్వాంసుడు ఎల్‌.సుబ్రమణ్యం, కథక్‌ నృతకారిణి కుముదిని లఖియా, ప్రముఖ జానపద గాయని శారాదా సిన్హా, జపాన్‌కు చెందిన వ్యాపార వేత్త, సుజుకీ మోటార్‌ చైర్మన్‌ ఒసామా సుజుకీ(మరణానంతరం)కి పద్మ విభూషణ్‌ పురస్కారాలు లభించాయి.

పద్మ భూషణ్‌ లభించిన వారిలో మహారాష్ట్ర మాజీ సీఎం, మాజీ లోక్‌సభ స్పీకర్‌, శివసేన నేత మనోహర్‌ జోషి, సీనియర్‌ జర్నలిస్టు కె.సూర్యప్రకాశ్‌, ప్రముఖ సినీనటులు అనంతనాగ్‌, అజిత్‌ కుమార్‌, దర్శకుడు శేఖర్‌ కపూర్‌, నటి, భరతనాట్య ప్రముఖురాలు శోభన, ప్రముఖ గాయకుడు పంకజ్‌ ఉదాస్‌, బిహార్‌ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్‌ కుమార్‌ మోదీ, ప్రముఖ హాకీ కోచ్‌ పీఆర్‌ శ్రీజేష్‌, ఇటీవల మరణించిన ప్రముఖ ఆర్థిక వేత్త వివేక్‌ దెబ్రాయ్‌, ఆధ్యాత్మికవేత్త సాధ్వి రితంబర, నల్లి స్కిల్స్‌ అధినేత నల్లి కుప్పుస్వామి శెట్టి తదితరులు ఉన్నారు. 

పద్మశ్రీ పురస్కారాలు పొందిన ప్రముఖులలో గాయకుడు అర్జిత్‌ సింగ్‌, సుప్రీంకోర్టు న్యాయవాది సీఎస్‌ వైద్య్యనాథన్‌, ప్రముఖ రాజస్థానీ రచయిత షిన్‌ కాప్‌ నిజాం తదితరులు ఉన్నారు. తమిళనాడుకు చెందిన దినమలర్‌ పత్రిక యజమాని లక్ష్మిపతి రామసుబ్బయ్యర్‌కు పద్మశ్రీ ఇచ్చారు. తమిళనాడు నుంచి ఇటీవలే రిటైర్‌ అయిన ప్రముఖ క్రికెట్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను పద్మశ్రీ వరించింది. 

అత్యంత విజయవంతమైన స్టార్ల్‌పలు ఫ్లిప్‌కార్ట్‌, ఓలా, బుక్‌మైషో, స్విగ్గీలను తొలిదశలోనే గుర్తించి వాటి పురోగతికి అండగా నిలిచిన వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ ప్రశాంత్‌ ప్రకాశ్‌(కర్ణాటక)ను పద్మశ్రీతో గౌరవించారు. జాతీయ గీతానికి కొత్త ట్యూన్‌ కట్టిన సంగీతకారుడు రికీ గ్యాన్‌ కేజ్‌(కర్ణాటక) పద్మశ్రీ అందుకున్న వారిలో ఉన్నారు.

పద్మశ్రీ అవార్డులు లభించిన వారిలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని వారు ఎందరో ఉన్నారు. వారిలో గోవా స్వాతంత్య్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న లిబియా లోబో సర్దేశాయ్‌, లింగ వివక్షతను కాదని పురుషాధిక్యత ఉన్న ధక్‌ వాద్యంపై 150 మంది మహిళలకు శిక్షణ ఇచ్చిన గోకుల్‌ చంద్ర దాస్‌(57) లాంటి వారు ఉన్నారు. 

మహిళా సాధికారతపై గళమెత్తిన 82 ఏండ్ల సాల్ల్లీహోల్కర్‌ మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్‌లో చేనేత పాఠశాలను స్థాపించి సంప్రదాయ నేత పనిపై వందలాది మందికి శిక్షణ ఇచ్చారు. ఇక వన్యప్రాణుల పరిశోధకుడు, మరాఠీ రచయిత మారుతీ భుజంగరావు చిటమ్‌పల్లి (92) పక్షులు, జంతువులు, చెట్లపై ప్రత్యేక నిఘంటువును రూపొందించారు.

జైపూర్‌కు చెందిన 68 ఏండ్ల భజన కళాకారిణి బతూల్‌ బేగం ప్యారిస్‌ టౌన్‌హాల్‌లో ప్రదర్శన ఇచ్చిన ఏకైక రాజస్థాన్‌ మహిళా కళాకారిణిగా పేరొందారు. డప్పు వాద్యకారుడు వేలు ఆసాన్‌ (58), తోలు బొమ్మలాట కళాకారిణి భీమవ్వ దొడ్డబలప్ప శిల్లేక్యాతర (96) కళా రంగానికి విశిష్ట సేవలు అందించారు. 

సురేందర్‌ నగర్‌ పర్మర్‌లో తంగల నేత కార్మికుడు పర్మార్‌ లావ్జీభాయ్‌ నాగ్జీభాయ్‌ (64), పేద క్యాన్సర్‌ రోగుల కోసం ఉచితంగా సేవలందించిన కలబుర్గికి చెందిన విజయలక్ష్మీ దేశ్‌మానే(కర్ణాట)లను దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం వరించింది. మహారాష్ట్రలో 400 హెక్టార్ల అడవిని పరిరక్షించిన చైత్రం దేవ్‌చంద్‌ పవార్‌, గిరిజన సంప్రదాయ సంగీత అభివృద్ధితో పాటు వెదురుతో తయారు చేసిన బస్తర్‌ వేణువు సృష్టికర్త పాండిరామ్‌ మాండవి కూడా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకోనున్నారు.