
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) దేశంలోనే అత్యంత ఖరీదైన ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నిర్మాణానికి సుమారు రూ.95 వేల కోట్ల వ్యయం అవసరమని ప్రాథమికంగా అంచనా వేసింది. శుక్రవారం బీపీసీఎల్ డైరెక్టర్ (ఫైనాన్స్) వెస్టా రామకృష్ణ గుప్తా ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఏటా తొమ్మిది మిలియన్ టన్నుల సామర్థ్యం గల ఆయిల్ రిఫైనరీ కం పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. దేశంలోని ఆయిల్, పెట్రో కెమికల్ రిఫైనరీల్లో ఇదే అత్యంత ఖరీదైన ప్రాజెక్టుగా నిలుస్తుందని చెప్పారు.
2014లో ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మహారాష్ట్రలోని రత్నగిరిలో రూ.3 లక్షల కోట్ల అంచనా వ్యయంతో 60 మిలియన్ టన్నుల మెగా ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని భావించామని, కానీ భూసేకరణ సమస్య వల్ల ముందుకు సాగలేదని వివరించారు. ఏపీలో ఏర్పాటు చేయబోయే ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ కోసం భూసేకరణ, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్), ఫీడ్ బ్యాక్ అధ్యయనాల కోసం ప్రీ ప్రాజెక్టు కార్యక్రమాల కింద రూ.6,100 కోట్లు ఖర్చు చేయడానికి బీపీసీఎల్ బోర్డు ఆమోదం తెలిపిందని వెల్లడించారు.
ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వం మూలధన రాయితీలు అందిస్తుందన్నారు. అయితే ఆర్థిక మద్దతుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎటువంటి సంకేతాలు ఇవ్వలేదని వెల్లడించారు. డీపీఆర్, ఫీడ్‌బ్యాక్ అధ్యయన నివేదికలకు ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుందని తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ప్రాజెక్టు ఖర్చు రూ.95 వేలకోట్లు ఉంటుందని తెలిపారు.
నివేదికలు వచ్చిన తర్వాత మొత్తం ప్రాజెక్టు ఖర్చు ఎంత ఉంటుందో అంచనాకు రావొచ్చని వివరించారు. జాయింట్ వెంచర్ ప్రాజెక్టుగా చేపట్టాలని చూస్తున్నామని చెప్పారు. మొత్తం ఎంత వ్యయం అవుతుందనే అంచనాకు వచ్చిన తర్వాత 48 నెలల్లో ప్రాజెక్టు పూర్తవుతుందని, వినియోగంలోకి వస్తుందని తెలిపారు. కోస్తా తీర ప్రాంతంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నామని, భూమి కూడా గుర్తించామని వెల్లడించారు.
ఈ ప్రాజెక్టుకు 6,000 ఎకరాల భూమి అవసరమని, భూసేకరణ పనులు చేపట్టాల్సి ఉందన్నారు. ఏటా 3-3.5 మిలియన్ టన్నులు పెట్రోల్, డీజిల్.. 3.8-4 మిలియన్ టన్నులు పెట్రో కెమికల్స్ ఫీడ్ స్టాక్ ఉత్పత్తి సామర్థ్యం ఉంటుందని వివరించారు. ఈ ప్రాజెక్టు 2040 వరకు భారతదేశ ఇంధన డిమాండ్‌ను తీర్చడానికి సరిపోతుందని అభిప్రాయపడ్డారు. దేశంలో ఇప్పటికే మూడు (ముంబై, కొచ్చి, మధ్యప్రదేశ్‌లోని బినాల్లో) రిఫైనరీలను ఏర్పాటు చేశామని, ఏపీలో నాలుగోది ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు.
More Stories
సూర్యలంకలో నిర్వహించే బీచ్ ఫెస్టివల్ కు వినూత్న ప్రచారం
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి