భారత సంతతికి చెందిన సిఇఒల్లో 6 శాతమే మహిళలు

భారత సంతతికి చెందిన సిఇఒల్లో 6 శాతమే మహిళలు

భారత సంతతికి చెందిన చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సిఇఒ)ల్లో కేవలం ఆరు శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారు. హెచ్‌ఎస్‌బిసి హురున్‌ గ్లోబల్‌ ఇండియన్‌ లిస్ట్‌ 2024ను విడుదల చేసింది. ఆ వివరాలు ప్రపంచవ్యాప్తంగా భారత సంతతికి చెందిన సిఇఒల్లో మహిళల ప్రాతినిధ్యం అత్యంత తక్కువగా ఉంది. 

ఈ లిస్టులో 200 కంపెనీలను ఎంపిక చేయగా 226 మంది సిఇఒలు ఉన్నారు. ఇందులో కేవలం 12 మంది మాత్రమే అంటే ఆరు శాతానికి సమానంగా మాత్రమే మహిళలకు అవకాశాలు దక్కాయి. 400 మందిని సర్వే చేసి ఈ రిపోర్ట్‌ను రూపొందించింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన భారతీయ సంతతికి చెందిన వ్యక్తులను గుర్తించింది.

ఇక ఈ జాబితాలో 12 మంది మహిళలు స్థానం దక్కించుకున్నారు. వారిలో నేహా నర్ఖేడే (కాన్‌ఫ్లూయెంట్‌), అంజలి సూద్‌ (టుబి), యామినీ రంగన్‌ (హబ్‌స్పాట్‌), లీనా నాయర్‌ (చానెల్‌) తదితరులు ఉన్నారు. గతేడాది నవంబరు 29 నాటికి ఆయా కంపెనీల మార్కెట్‌ స్థాయిలను బట్టి హెచ్‌ఎ్‌సబీసీ హురున్‌ ఈ ర్యాంకుల జాబితాను రూపొందించింది.

కంపెనీ విలువను బట్టి ర్యాంకింగ్‌లను ఇచ్చింది. ఇందులో ఎక్కువ మంది అమెరికన్‌ కంపెనీల్లోనే పని చేయడం విశేషం. అమెరికాలో 80 శాతం, బ్రిటన్‌లో 5 శాతం, యుఎఇలో 4 శాతం చొప్పున మంది స్థిరపడ్డారు. ఆయా కంపెనీల మొత్తం విలువ 10 లక్షల కోట్ల డాలర్లు ఉంటుందని నివేదిక అంచనా.  జాబితాలో సాఫ్ట్‌వేర్‌, ఫైనాన్స్‌, ఎఐ సహా వివిధ పరిశ్రమలకు చెందిన వ్యక్తులు ఉన్నారు.

87 మంది సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌ కంపెనీలకు చెందినవారు ఉండగా.. ఆ తర్వాత ఫైనాన్స్‌, హెల్త్‌కేర్‌ రంగాల వారు ఉన్నారు. టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సత్య నాదెళ్ల అగ్రస్థానంలో నిలువగా, ఆ తర్వాత స్థానాల్లో ఆల్ఫాబెట్‌ సుందర్‌ పిచారు, యూట్యూబ్‌ సిఇఒ నీల్‌ మోహన్‌లు ఉన్నారు. ఫ్రెంచ్‌ లగ్జరీ ఫ్యాషన్‌ ఉత్పత్తుల కంపెనీ ఛానల్‌ సిఇఒ లీనా నాయర్‌ భారత సంతతికి చెందిన అత్యంత ప్రభావవంతమైన మహిళగా గుర్తింపు పొందారు. 

బ్రిటిష్‌ ఇండియన్‌ బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌ లీనా నాయర్‌ జనవరి 2022 నుండి ఛానల్‌కు నేతృత్వం వహిస్తున్నారు. నాయర్‌ హయాంలో ఫ్రెంచ్‌ లగ్జరీ హౌస్‌ ఆదాయం సంవత్సరానికి 16 శాతం పెరిగి 2023లో 19.7 బిలియన్లకు చేరుకుంది. ఇంతక్రితం ఆమె యూనిలీవర్‌లో 30 ఏళ్లు పని చేసింది. 

ఈ జాబితాలో అతి పిన్న వయస్కురాలుగా కమ్యూన్‌ సహ వ్యవస్థాపకుడు, సిఇఒ అయినా తనరు టాండన్‌ నిలిచారు. ఆమె కేవలం 27 సంవత్సరాల వయసులోనే ఈ జాబితాలో చోటు సంపాదించుకుంది. కమ్యూన్‌ యుఎస్‌ కస్టమర్లకు హెల్త్‌కేర్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను అందిస్తుంది. జాబితాలోని టాప్‌ 10 వ్యక్తులు మొత్తం జాబితాలోని వారి విలువలో 73 శాతం వాటాను కలిగి ఉండటం గమనార్హం.