అమెరికాలో 538 మంది అక్రమ వలసదారుల అరెస్ట్

అమెరికాలో 538  మంది అక్రమ వలసదారుల అరెస్ట్

అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ ముఖ్యంగా అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు.  తాను అధికారంలోకి వస్తే అక్రమ వలసదారులను సొంత దేశాలకు పంపిస్తానని, ఇందుకోసం అమెరికా చరిత్రలోనే అతిపెద్ద కార్యక్రమాన్ని చేపడతానని డొనాల్డ్‌ ట్రంప్‌ హామీ ఇచ్చినట్టుగానే ఇప్పుడు పని మొదలుపెట్టారు. 

మూడు రోజుల్లోనే అమెరికా అధికారులు 538 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేశారని, వందలాది మంది సైనిక విమానాల్లో దేశం నుంచి పంపించేశారని వైట్‌ హౌజ్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలీన్‌ లీవిట్‌ తెలిపారు. అరెస్టు చేసిన అక్రమ వలసదారులు అనేక నేరాలకు పాల్పడ్డారని ఆమె చెప్పారు. తాజాగా దేశంలోకి అక్రమంగా ప్రవేశించడంతోపాటు దొంగతనాలు, ఇతర నేరాలకు పాల్పడిన వలసదారులను అక్కడి అధికారులు అరెస్ట్‌ చేశారు. వందల మందిని దేశం నుంచి పంపించేశారు.

 అరెస్టైన వారంతా ఉగ్రవాదం, మాదకద్రవ్యాల రవాణా, లైంగిన నేరాలు వంటి కేసుల్లో నిందితులుగా ఉన్నవారేనని తెలిపారు. అంతేకాకుండా సైనిక విమానాల్ని ఉపయోగించి వందలాది మందిని బహిష్కరించినట్లు తెలిపారు. కాగా, అక్రమ వలసలదారుల బహిష్కరణకు సంబంధించి తీసుకొచ్చిన కీలక బిల్లుకు యూఎస్‌ కాంగ్రెస్‌ ఇటీవలే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. 

దొంగతనాలు, తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకునేలా ఈ బిల్లును రూపొందించారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్‌ ఆమోదించిన అత్యంత ముఖ్యమైన ఇమ్మిగ్రేషన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బిల్లు ఇదే అని అక్కడి అధికారులు పేర్కొంటున్నారు. దేశంలో వేల సంఖ్యలో ఉగ్రవాదులు ఉన్నార‌ని, వేల వేల సంఖ్యలో హంత‌కులు కూడా ఉన్నార‌ని, వారంద‌ర్నీ అణిచివేయ‌నున్నట్లు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. 

అమెరికాలో ప్రస్తుతం 11 వేల మంది హంత‌కులు జీవిస్తున్నట్లు చెప్పారు. దాంట్లో 48 శాతం మంది.. ఒక‌రి క‌న్నా ఎక్కువ మందిని హ‌త‌మార్చిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. విదేశాల్లో జైళ్లలో ఉన్న వారు అమెరికాకు వ‌చ్చేస్తున్నట్లు తెలిపారు. వెనిజులాలో క్రైం రేటు 78 శాతం త‌గ్గిన‌ట్లు ట్రంప్ చెప్పారు. విదేశాల్లోని వీధి గ్యాంగ్‌లు ఇప్పుడు అమెరికాకు వ‌చ్చేశాయ‌ని, ఆ ముఠాల ఆగ‌డాల‌ను కొల‌రాడో, లాస్ ఏంజిల్స్‌లో చూస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.

పీవ్ రీసెర్చ్ సెంట‌ర్ ప్రకారం.. అమెరికాలో 40 ల‌క్ష‌ల మంది మెక్సిక‌న్లు అక్ర‌మంగా జీవిస్తున్నారు. 2022లో స‌రిహ‌ద్దు ద్వారా సుమారు ల‌క్ష‌న్న‌ర మంది మెక్సిక‌న్లు అమెరికాలోకి ప్ర‌వేశించిన‌ట్లు తెలుస్తోంది. అమెరికాకు వ‌ల‌స వెళ్తున్న వారిలో భార‌త్‌, చైనా, వెనిజులా, క్యూబా, బ్రేజిల్, కెన‌డా దేశస్థులు ఉన్నారు.

మరోవంక, వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీరు అమెరికాలోని భారతీయ విద్యార్థులను తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నది. చదువుకుంటూ క్యాంపస్‌ బయట పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేసుకునే విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా క్యాంపస్‌ బయట పని చేస్తూ అధికారులకు దొరికితే దేశం నుంచి పంపిస్తారని భయపడుతున్నారు. 

ఎఫ్‌-1(స్టూడెంట్‌) వీసాపై అమెరికాకు ప్రతియేటా లక్షలాది మంది భారతీయ విద్యార్థులు వస్తున్నారు. ఇందుకోసం తల్లిదండ్రులు దాదాపు రూ.30-40 లక్షలు ఖర్చు చేస్తున్నారు. అమెరికా వచ్చిన తర్వాత విద్యార్థులు తమ జీవనవ్యయం కోసం చదువుకుంటూ, ఏదో ఓ పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తుంటారు. అయితే, నిబంధనల ప్రకారం విద్యార్థులు యూనివర్సిటీ క్యాంపస్‌లోనే పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేయాలి. అది కూడా వారానికి 20 గంటలకు మించి పని చేయొద్దు.