ఎంపీలో 17 ధార్మిక ప్రదేశాల్లో మద్యంపై నిషేధం

ఎంపీలో 17 ధార్మిక ప్రదేశాల్లో మద్యంపై నిషేధం
మతపరమైన ప్రదేశాల్లో మద్యంపై నిషేధం విధిస్తూ మధ్యప్రదేశ్ మంత్రివర్గం మంత్రివర్గం శుక్రవారం శుక్రవారంనాడు కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ నిర్ణయం కూడా అమలవుతుంది. మహేశ్వర్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించారు.

అధికారిక సమాచారం ప్రకారం, 1 నగర నిగమ్, 6 నగర్ పాలిక, 5 నగర్ పరిషత్, రూరల్ పంచాయతీల్లో మద్యంపై నిషేధం విధించారు. వీటిలో ఉజ్జయిని, ఓంకారేశ్వర్, బాందక్పూర్, మైహర్, సల్కాన్‌పూర్, లింగ, దితియా, మండలేశ్వర్, మహేశ్వర్, మాండసౌర్, అమర్‌కంటక్, మాండ్లా (నర్మదా ఘాట్), ముల్తాయ్, కుండల్‌పూర్, చిత్రకూట్, బర్మన్, పన్నా ఉన్నాయి. వీటికి మత ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలుగా మంచి పేరుంది.

ఉజ్జయిని, ఓంకారేశ్వర్‌లు జ్యోతిర్లింగాలుగా ప్రసిద్ధి చెందగా, మైహర్ ప్రముఖ శక్తిపీఠంగా ఉంది. నర్మదా నది పుట్టుక ప్రాంతం అమర్‌కంటక్. మధ్యప్రదేశ్‌లో కృష్ణ భగవానుడు, శ్రీరాముడు ఎక్కడెక్కడ అడుగుపెట్టారో అక్కడ ఈ మద్యం అమ్మకాలపై నిషేధం విధించినట్టు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తెలిపారు.

“ప్రధాన పుణ్య క్షేత్రాలున్న 17 పట్టణాల్లో ప్రస్తుతమున్న మద్యం దుకాణాలను పూర్తిగా మూసేస్తాం. వాటిని ఇతర ప్రాంతాలకు తరలించే ప్రసక్తే లేదు. ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న మద్యం దుకాణాలన్నీ మూతపడతాయి” అని సీఎం ప్రకటించారు. నర్మదా నది పరివాహక ప్రాంతానికి 5 కిలోమీటర్ల పరిధిలోని మద్యం దుకాణాలు కూడా బంద్ అవుతాయని సీఎం తెలిపారు.

రాష్ట్రంలో క్రమంగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేసే దిశగా తొలుత 17 సిటీల్లో మద్యం దుకాణాలను మూసేస్తున్నట్టు చెప్పారు. వీటిని వేరేచోటుకు తరలించేది లేదని, శాశ్వతంగా మతపడతాయని వివరించారు.