తెలంగాణాలో రైతుల మరణ మృదంగం

తెలంగాణాలో రైతుల మరణ మృదంగం
 తెలంగాణాలో రైతుల మరణమృదంగం మోగుతూనే ఉన్నది. అన్నదాతల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో రెండు రోజుల్లో ఇద్దరు రైతుల బలవన్మరణం నుంచి కోలుకోకముందే సోమవారం మరో నాలుగు జిల్లాల్లో అప్పుల బాధతో నలుగురు యువ రైతులు ప్రాణాలు వదిలారు. 
 
వేసిన పంటలు చేతికిరాక, వచ్చిన పంటకు సరైన మద్దతు ధర లేక, బోరు బావుల్లో నీళ్లు పడక అప్పులు భారమై ముగ్గురు, రుణమాఫీ కాక మనస్తాపంతో ఒకరు తనువు చాలించారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు, వరంగల్‌ జిల్లా సగెం మండలం పోచమ్మతండా, వికారాబాద్‌ జిల్లా దోమ మండలం అయినాపూర్‌, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో జరిగిన ఈ ఘటనలు తెలంగాణలో రైతుల ప్రస్తుత దయనీయ పరిస్థితికి అద్దంపడుతున్నాయి.

రాష్ట్ర రైతాంగానికి అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ఏడాది పాలనలో ఆత్మహత్యలు విపరతంగా పరిగిపోవడం ఆందోన కలిగిస్తున్నది. ఇప్పటికే 400 మందికి పైగా రైతన్నలు ఆత్మహత్య చేసుకున్న ఆందోళనకర పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నాయి.  రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన రైతు రుణమాఫీ కనీసం 30 శాతాన్ని దాటకపోవడం, రైతన్నలకు కొన్ని సంవత్సరాలుగా అందుతున్న రైతుబంధును ఆపి, ఇస్తామన్న రూ.15 వేల రైతు భరోసాను కూడా ఎత్తగొట్టడం వంటి ప్రధానమైన ఆర్థిక సమస్యలు రైతు ఆత్మహత్యలకు దారితీస్తున్నట్లు భావిస్తున్నారు.

వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్తు సరఫరా, సకాలంలో సాగునీటి వసతి కల్పించే విషయంలో సరారు పూర్తిగా చేతులెత్తేయడంతోనే రైతులు తీవ్ర సంక్షోభంలో కురుకుపోతున్నారు. కాంగ్రెస్‌ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్లే రాష్ట్ర వ్యవసాయ రంగం పూర్తిగా చిన్నాభిన్నమైందని విమర్శలు చెలరేగుతున్నాయి.