జుకర్‌బర్గ్‌కు పార్లమెంటరీ ప్యానల్ సమన్లు

జుకర్‌బర్గ్‌కు పార్లమెంటరీ ప్యానల్ సమన్లు
భారత్‌లో ఇటీవల జరిగిన 18వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలను వక్రీకరిస్తూ మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై ఆయనకు సమన్లు పంపాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది. బీజేపీ ఎంపీ, కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హౌస్ ప్యానల్ చైర్మన్ డాక్టర్ నిషికాంత్ దూబే ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
తప్పుడు సమచారం వల్ల ప్రజాస్వామ్య దేశం ప్రతిష్ట దెబ్బతింటుందని పేర్కొంటూ చేసిన తప్పును సరిచేసుకునేందుకు ఇటు పార్లమెంటుకు, అటు ప్రజలకు మోటా సంస్థ క్షమాపణ చెప్పాలని ఆయన స్పష్టం చేశారు.  లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై జుకర్‌బర్గ్ చేసిన వాదనను ఇప్పటికే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తప్పుపట్టారు. 2024 ఎన్నికల్లో భారత్ సహా ప్రపంచ దేశాల్లో జరిగిన అన్ని ఎన్నికల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓటమి చెందాయని జుకర్‌బర్గ్ ఇటీవల ఆరోపించారు. 
 
యన వాదనను అశ్విని వైష్ణవ్ ఖండిస్తూ, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేపై ఓటర్లు విశ్వాసం ఉంచి మూడోసారి గెలిపించారని చెప్పారు. 64 కోట్ల మంది భారతీయ ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొన్నారని చెప్పారు. 
 
కరోనా తర్వాత భారత్ సహా అన్ని దేశాల్లో అధికార ప్రభుత్వాలు ఓడిపోయాయని చెప్పడం సరికాదని, 80 కోట్ల మందికి ఉచిత ఆహారం, 220 కోట్ల వ్యాక్సిన్లు ఇవ్వడమే కాకుండా ప్రపంచ దేశాలకు భారత్ సాయం చేసిందని, మోదీ సాహసోపేత నిర్ణయాలే ఎన్నికల్లో విజయానికి నిదర్శనంగా నిలిచాయని అశ్విని వైష్ణవ్ చెప్పారు. 
 
వాస్తవాలను, విశ్వసనీయతను కాపాడుకోవాలని మెటాను ట్యాగ్ చేస్తూ అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే మెటా సంస్థకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమన్లు పంపనున్నట్టు నిషికాంత్ దూబే ప్రకటించారు.