
తిరువాభరణా ఘట్టం పూర్తయ్యాక పొన్నాంబల మేడులో కందమల శిఖరంపై మకరజ్యోతి రూపంలో అయ్యప్ప భక్తులకు దర్శనమిచ్చారు. దీనితో హరిహర సుతుడైన స్వామి అయ్యప్పను స్మరిస్తూ స్వామియే శరణం అయ్యప్ప అన్న శరణుఘోషలతో శబరిగిరులు ప్రతిధ్వనించాయి. మకరజ్యోతిని వీక్షించేందుకు వచ్చిన అయ్యప్ప స్వాములతో శబరిమల సన్నిధానం కిక్కిరిసిపోయింది.
కాంతమాల కొండలపై దేవతలు, రుషులు కలిసి భగవంతునికి హారతి ఇస్తారని అయ్యప్ప భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ రోజు పందాళం నుంచి తీసుకువచ్చిన తిరువాభరణాలను ప్రధాన అర్చకులు స్వామివారికి అలంకరించారు. అనంతరం మూలమూర్తికి హారతి నిచ్చారు. ఆ వెంటనే క్షణాల్లో చీకట్లను తొలగిస్తూ పొన్నాంబలంమేడు పర్వత శిఖరాల్లో జ్యోతి దర్శనమిచ్చింది.
అది చూసి మనసు నిండుగా భక్తిభావంతో తన్మయం చెందిన భక్తులు స్వామియే శరణం అయ్యప్ప అంటూ శరణమిల్లారు. జ్యోతి దర్శనం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అయ్యప్ప భక్తులు ఏటా 41 రోజులు దీక్ష చేసి శబరిమలకు వెళ్తారు. మకరజ్యోతిని దర్శించుకున్న తర్వాత అయ్యప్ప మాల వేసుకున్న స్వాములు దీక్షను విరమిస్తారు. తన భక్తులను ఆశీర్వదించడానికి సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామే స్వయంగా మకర జ్యోతిగా దర్శనమిస్తాడని నమ్మకం. ఈ జ్యోతి దర్శనం చేసిన వారికి జన్మరాహిత్యం కలిగి, నేరుగా భగవంతుడిని చేరుకుంటారని భక్తులు విశ్వసిస్తారు.
పురాణాల ప్రకారం శబరిమల ఆలయాన్ని పరశురాముడు స్థాపించాడని నమ్ముతూ ఉంటారు. ఇక రామాయణంలో కూడా శబరిమల ప్రస్తావన ఉండటం గమనార్హం. రాముడు పంబా నదీ తీరంలోని శబరి ఆశ్రమానికి వెళ్లినట్లు చెబుతారు. దేశంలోని నలుమూలలతోపాటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా లక్షలాదిగా అయ్యప్పస్వామి భక్తులు మకరజ్యోతి దర్శించుకున్నారు.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
చొరబాట్లేతోనే ముస్లిం జనాభా అసాధారణంగా పెరుగుదల
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం