తెలంగాణలోని పసుపు రైతులు కేంద్రం సంక్రాంతి కానుక ప్రకటించింది. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పచ్చ జెండా ఊపటమే కాదు సంక్రాంతి పండగ రోజున, జనవరి 14వ తేదీనే పసుపు బోర్డు ప్రధాన కార్యాలయానన్ని ప్రారంభించనున్నట్టు కేంద్రం ప్రకటన జారీ చేసింది.
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 14వ తేదీన ఉదయం 10 గంటలకు నిజామబాద్‌లోని నిఖిల్ సాయి ఇంటర్నేషనల్ హోటల్లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్స కార్యక్రమం జరగనుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుండి వర్చ్యువల్ గా ఈ బోర్డును ప్రారంభిస్తారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా జాతీయ పసుపుబోర్డు చైర్మన్‌గా పల్లె గంగారెడ్డి బాధ్యతలు చేపట్టడంతో పాటు పసుపురైతుల సమస్యల పరిష్కారంపై విధానపరమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుతో రైతులకు కొత్త అవకాశాలు కలుగనున్నాయి. పసుపు పంటకు గిట్టుబాటు ధరలు దక్కనున్నాయి.
బోర్డు ద్వారా పసుపు ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పే అవకాశాలు లేకపోలేదు. ఇకపై పసుపు ఎగుమతులకు గణనీయమైన అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్‌లో జాతీయ పసుపుబోర్డు ఏర్పాటు చేయడం పట్ల ఎంపీ ధర్మపురి అర్వింద్ హర్షం వ్యక్తం చేశారు. పసుపురైతుల కష్టాలను గుర్తించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బోర్డు ఏర్పాటుచేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తమ 37 సంవత్సరాల పసుపురైతుల కల ఈనాడు నెరవేరడం సంతోషకరమని పేర్కొన్నారు.
నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డు కేంద్ర ప్రధాన కార్యాలయాన్ని నిజామాబాద్‌లోనే ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు కేంద్ర కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో, సంక్రాంతి పండుగ రోజే పసుపు బోర్డు కేంద్ర ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనుంది.
ఎక్కువ విస్తీర్ణంలో పసుపును పండించే తమ రాష్ట్రంలోనే పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని పెట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో కేంద్ర ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడిని తెచ్చినప్పటికీ, ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు నిజామాబాదులోనే బోర్డు కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో జిల్లా వ్యాప్తంగా పసుపు రైతులు, బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
మరోవైపు, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా నిజామాబాద్ కు చెందిన పల్లె గంగారెడ్డిని నియమించారు. అంకాపూర్ గ్రామానికి చెందిన రైతు పల్లె గంగారెడ్డి ప్రస్తుతం బీజేపీలో సీనియర్ నేతగా, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈ మేరకు జనవరి 13న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సంక్రాంతి కానుకగా కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డుని కేవలం తెలుగు రాష్ట్రాలకే కాదు యావత్ దేశానికి అందిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ దీన్ని ఏర్పాటు చేశారని కిషన్ రెడ్డి తెలిపారు.
నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వానిది క్రియాశీలక పాత్ర అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పసుపు రైతుల చిరకాల వాంఛను నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినట్లు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
More Stories
స్వదేశీ, స్వావలంబన దిశగా స్వదేశీ జాగరణ్ మంచ్
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు