మరో రెండు భారతీయ కంపెనలపై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు

మరో రెండు భారతీయ కంపెనలపై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు
రష్యా చమురు ఉత్పత్తిదారులు, నౌకలపై అమెరికా విధించిన భారీ ఆంక్షలు భారత్ తో పాటు చైనాపై తీవ్ర ప్రభావం చూపబోతున్నాయి. ఉక్రెయిన్ పై యుద్దం చేస్తున్న రష్యా దూకుడును అడ్డుకునేందుకు అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం భారత్, చైనాలో చమురు ధరలు పెంచే అవకాశాలున్నాయి. పాశ్చాత్య ఆంక్షలు, 2022లో గ్రూప్ ఆఫ్ సెవెన్ కంట్రీస్ విధించిన ధరల పరిమితి వల్ల భారత్, చైనాకు చమురు రవాణా చేయడానికి అనేక ట్యాంకర్లు వాడుకున్నారు.
అలాగే రష్యా చమురు వాణిజ్యాన్ని యూరప్ నుండి ఆసియాకు మార్చింది. కొన్ని ట్యాంకర్లు ఇరాన్ నుండి చమురును కూడా రవాణా చేశాయి. ఇప్పుడు ఇవన్నీ ఆంక్షల పరిధిలోకి వచ్చేశాయి. కొత్త ఆంక్షల వల్ల రష్యా చమురు ఎగుమతులు తీవ్రంగా దెబ్బతింటాయని, దీని వల్ల చైనా స్వతంత్ర రిఫైనర్లు రిఫైనింగ్ అవుట్‌ పుట్‌ను తగ్గించుకోవలసి వస్తుందని చైనా చెబుతోంది.  అమెరికా ఆంక్షల వల్ల తక్కువ సమయంలో రష్యా నుండి ముడి చమురును సరఫరా చేయడానికి అందుబాటులో ఉన్న నౌకల లభ్యతను గణనీయంగా తగ్గిస్తాయి. సరుకు రవాణా ధరలను పెంచుతాయని అంచనా వేస్తున్నారు.
రష్యా ఇంధన రంగానికి వ్యతిరేకంగా ప్రకటించిన తాజా చర్యలో భాగంగా అమెరికా, బ్రిటన్‌లు రెండు భారతీయ కంపెనీలను నిషేధించాయి. అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌, బ్రిటీష్‌ ప్రభుత్వం చేపట్టిన ఈ భారీ చర్యలు రెండు ప్రధాన రష్యన్‌ పెట్రోలియం ఉత్పత్తిదారులైన గాజ్‌ప్రోమ్‌ నెఫ్ట్‌, సుర్గుట్‌నెఫ్టెగాజ్‌, వాటి అనుబంధ సంస్థలను లక్ష్యంగా చేసుకున్నాయి. 
 
రష్యన్‌ ముడి చమురును రవాణా చేసే 183 నౌకలపై ఆంక్షలు కూడా ఉన్నాయి. జాబితాలో ఉన్న రెండు భారతీయ సంస్థలు స్కైహార్ట్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌, అవిషన్‌ షిప్పింగ్‌ సర్వీసెస్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌. యూఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రకటన ప్రకారం ఈ కంపెనీలు రష్యా ఆర్కిటిక్‌ ఎల్‌ఎన్‌జీ 2 ప్రాజెక్టుకు మద్దతునిచ్చాయి. 
 
ఇది దేశంలోని అతిపెద్ద ధ్రువీకృత సహజ వాయువు ఉత్పత్తిదారు నోవాటెక్‌ యాజమాన్య అభివృద్ధిలో పాక్షికంగా ఉన్నది. ఈ ప్రాజెక్ట్‌ 2023 నుంచి అమెరికా ఆంక్షల కింద ఉంది. ఆర్కిటిక్‌ ఎల్‌ఎన్‌జీ 2 ప్రాజెక్ట్‌ కు భౌతికంగా సహాయం చేయడం లేదా మద్దతు అందించడం కోసం రెండు కంపెనీలను ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ 14024 కింద నియమించారు. 
 
అదనంగా, అవిజన్‌, ప్రవాసి.. ఒనిక్స్‌ నిర్వహించే రెండు నౌకలను కంపెనీకి సంబంధించిన ఆస్తిగా గుర్తించారు. ప్రాజెక్ట్‌ నుంచి సరుకును లోడ్‌ చేసే ధ్రువీకృత సహజ వాయువు వాహకాలను భారత కంపెనీలు నిర్వహించాయి. ఆర్కిటిక్‌ ఎల్‌ఎన్‌జీ 2 ప్రాజెక్ట్‌ను ”పునరుజ్జీవింపజేసే ప్రయత్నంలో” ”థర్డ్‌ కంట్రీ షిప్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థల ద్వారా ఎల్‌ఎన్‌జీ వాహకాల యాజమాన్యాన్ని అస్పష్టం చేసే ప్రయత్నాలలో రష్యా నిమగమైందని” అమెరికా అధికారులు పేర్కొన్నారు. 
 
గతేడాది సెప్టెంబర్‌లో, ముంబయిలో నమోదు చేసిన రెండు భారతీయ ఆధారిత కంపెనీలు గోటిక్‌, ప్లియో ఎనర్జీపై వాషింగ్టన్‌ ఆంక్షలను విధించింది. ఇవి ప్రాజెక్ట్‌ తో అనుసంధానించబడి ఉన్నాయని పేర్కొన్నది. నోవాటెక్‌ ప్రాజెక్ట్‌ నుంచి ఎల్‌ఎన్‌జీని ”ఎగుమతి చేసే ప్రయత్నాలకు” సంబంధం ఉందని ఆరోపిస్తూ ఈ కంపెనీల యాజమాన్యంలోని రెండు నౌకలపైన కూడా ఆంక్షలను విధించింది. 
 
గతేడాది అమెరికా ఒక ప్రత్యేక చర్యలో, రష్యన్‌ సంస్థలకు ఎలక్ట్రానిక్స్‌, విమానయాన భాగాలను సరఫరా చేసినందుకు 19 భారతీయ కంపెనీలు, ఇద్దరు జాతీయులపై ఆంక్షలు విధించింది. దీనికి ప్రతిస్పందనగా, ఆ కంపెనీలు దేశీయ చట్టాలను ఉల్లంఘించలేదనీ, భారతదేశ చట్టాల పరిధిలోనే పనిచేస్తున్నాయని భారత్‌ పేర్కొన్నది. సమస్యలను ”స్పష్టం” చేయడానికి భారత్‌ అమెరికాతో సంప్రదింపులు జరుపుతోందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
 
గత రెండు సంవత్సరాలలో రష్యా భారత్‌కు కీలక ఇంధన భాగస్వామిగా అవతరించింది. ముడి చమురు సరఫరాలో అగ్రగామిగా అవతరించింది. గతేడాది సెప్టెంబరులో రష్యా నుంచి భారత్‌ చేసుకున్న ముడి చమురు దిగుమతులు ఆగస్టు నుంచి 11.7 శాతం పెరిగి, దాదాపు 1.9 మిలియన్‌ బ్యారెళ్లకు చేరుకున్నాయి. ఇది ఆ నెలలో భారత మొత్తం ముడి చమురు దిగుమతుల్లో దాదాపు 40 శాతం కావటం విశేషం. దేశ ఇంధన భద్రతను నిర్ధారించడంలో మాస్కో కీలక పాత్ర పోషిస్తున్నదని భారత్‌ తెలిపింది.