గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతంలో నిర్వహించే మహా కుంభమేళాకు దేశ, విదేశాల నుంచి దాదాపు 35 కోట్ల మంది ప్రజలు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసింది. భద్రతతోపాటు సౌకర్యాల కోసం ఆధునిక సాంకేతిక సహకారాన్ని విస్తృతంగా వాడుకుంటోంది. కృత్రిమ మేధ సహకారంతో దీనిని డిజిటల్ కుంభమేళాగా మార్చేసింది.
మహాకుంభమేళా సోమవారం లాంఛనంగా ప్రారంభం కానుండగా, దీనికి రెండు రోజుల ముందు అంటే శనివారమే 25 లక్షల మంది ప్రజలు పవిత్ర స్నానా లు ఆచరించారని అధికారులు తెలిపారు. ఇక, మహాకుంభమేళా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో తరచుగా పరిశీలించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీనిని భారత దేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా అభివర్ణించారు.
ఆధునికతకు, స్వచ్ఛతకు, భద్రతకు అతి పెద్ద ఉదాహరణగా నిలుస్తుందని తెలిపారు. ‘‘ఇది కేవలం ఓ మతానికి సంబంధించిన కార్యక్రమం కాదు. సామాజిక, ఆధ్యాత్మిక ఐక్యతకు ప్రతీక’’ అని సీఎం ఉద్ఘాటించారు. 10,000 ఎకరాల్లో కుంభమేళాకు ఏర్పాట్లు జరిగాయని, ఏ సమయంలోనైనా 50 లక్షల మంది నుంచి కోటి మంది ఉండగలిగేలా సౌకర్యాలను కల్పించామని వెల్లడించారు.
10 వేల ఎకరాల పరిధిలో ఈ ఆధ్యాత్మిక నగరాన్ని ఏర్పాటు చేశారు. యాత్రికులకు ఇబ్బంది లేకుండా 1.6 లక్షల టెంట్లను, 1.5 లక్షల మరుగు దొడ్లను నిర్మించారు. భద్రత కోసం 55 పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 45,000 మంది పోలీసులను మోహరించారు. సాధువులకు సంబంధించిన 13 అఖాడాలు కుంభమేళాలో భాగం కానున్నాయిప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధువులు, సాధ్వీలు, నాగా సాధువులు, కల్పవాసీలు, భక్తులకు స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇక, ప్రభుత్వ భవనాలు సహా మహా కుంభమేళా జరిగే చోట భారీ ఎత్తున హిందూ ధర్మాన్ని కళ్లకు కట్టినట్టు చూపించే కుడ్య, తైలవర్ణ చిత్రాలను రూపొందించారు. పూర్ణ కుంభ, శంఖు ఆకృతులు భక్తులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఎక్కడికక్కడ సమూహ నిర్వహణ విధానాలను అవలంభిస్తున్నారు.
ఆదివారం (జనవరి 12) స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని(జాతీయ యువజన దినోత్సవం) ప్రయాగ్రాజ్లో ‘యువ మహాకుంభ్’ను నిర్వహించారు. తెలుగుతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ భాషల్లోనూ సేవలందించే కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారు.
`భక్తులకు సౌకర్యం పెంపుదలకు డిజిటల్ టూరిస్ట్ మ్యాప్ మరుగుదొడ్ల పరిశుభ్రత పర్యవేక్షణకు వీలు కల్పిస్తుంది. ఇక స్మార్ట్ఫోన్లతో సమీకృతమైన ఎఐ ఆధారిత భద్రత వ్యవస్థ భద్రత చేకూరేలా చేస్తుంది’ అని ముఖ్యమంత్రి వివరించారు. జన సందోహం నియంత్రణ కోసం వివిధ కూడళ్లు, ముక్కోణ కూడళ్లలో బారికేడ్లు ఏర్పాటు చేశారు.
నదుల సంగమ ప్రదేశాల్లో ఒక చోట నుంచి మరొక చోటకు ప్రజల రవాణాకు వీలుగా సంగమ ప్రాంతంలోను, ఫాఫమౌలోను 30 బల్లకట్లు సిద్ధం చేశారు. ఈ పుణ్య క్షేత్రంలోకి భక్తులను స్వాగతించేందుకు ప్రవేశ ప్రదేశాలు కొన్నిటి వద్ద భారీ గేట్లు కూడా అమర్చారు. 2024 జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని ‘ప్రాణ ప్రతిష్ఠ’ తరువాత తొలి కుంభ్ అవుతున్న దృష్టా ఈ దఫా కుంభ మేళా ప్రత్యేక ప్రాముఖ్యం సంతరించుకుంటున్నది.
More Stories
యాసిన్ మాలిక్ ను `శాంతిదూత’గా అభివర్ణించిన మన్మోహన్!
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు