మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆదర్శంగా నిలిచారు

మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆదర్శంగా నిలిచారు

తెలంగాణ సమాజానికి ఆదర్శ రాజకీయ నాయకుడిగా విద్యాసాగర్ రావు నిలిచారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు.  మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు ఆత్మకథ ‘ఉనిక’ పుస్తకాన్ని ఆదివారం ఆవిష్కరిస్తూ  ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి రాజకీయం నుంచి ఉమ్మడి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా,కేంద్ర మంత్రిగా పని చేశారని తెలిపారు. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు గవర్నర్‌గా విద్యాసాగర్ రావు పని చేశాారని గుర్తు చేశారు. 

ప్రధానమంత్రి నరేంద్రమోదీ విద్యాసాగర్ రావు సమర్ధతను గుర్తించి అవకాశం ఇచ్చారని చెప్పారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నా విద్యాసాగర్ రావుపై ఎలాంటి ఆరోపణలు లేవని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో సిద్ధాంత పరంగా నాడు రాజకీయాలు చేశారని చెప్పారు. రాష్ట్రంలో రెండవ తరంలో జైపాల్ రెడ్డి, విద్యా సాగర్ రావు, దత్తాత్రేయ ఉన్నారని తెలిపారు. మూడో తరంలో చెప్పుకోతగ్గ నేతలు లేరని పేర్కొంటూ గోదావరి జలాల కోసం విద్యాసాగర్ రావు పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. 

గోదావరి జలాలు తెలంగాణకు వినియోగించుకోవాలంటే విద్యాసాగర్ రావు అనుభవం అవసరమని తెలిపారు. మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ఉన్నారని అంటూ తుమ్మిడి హెట్టి వద్ద భూసేకరణ కోసం విద్యాసాగర్ రావు అవసరం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. తనకు ఎలాంటి భేషజాలు లేవని, ఎవరి సలహాలనైనా స్వీకరిస్తానని స్పష్టం చేశారు.

‘‘విపక్ష నేతలైనా అవసరం ఉన్నచోట వారి అనుభవాన్ని వినియోగించుకుంటాం. తెలంగాణ ట్రిలియన్‌ డాలర్‌ ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి నిరంతరం కృషి చేస్తున్నాం. మెట్రో, రీజనల్‌ రింగ్‌రోడ్డు నిర్మాణాల విషయాలపై కేంద్రం సహకరించాలని ప్రధానమంత్రి మోదీని కోరాను. కేంద్రం సహకరిస్తేనే రాష్ట్రాల అభివృద్ధి త్వరగా పరిపూర్ణమవుతుంది. హైదరాబాద్‌ మెట్రోకు అనుమతులు తెచ్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఒకప్పుడు రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్‌ మెట్రో, నేడు 9వ స్థానానికి పడిపోవడం బాధాకరం. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కొన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీలు ఏకతాటిగా కలిసి పోరాడుతున్నాయి. మనం ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడాలి’’  అని రేవంత్ రెడ్డి తెలిపారు.

నాయకులు ఎవరు ఏ పార్టీలో ఉన్నా, జాతీయ భావన ఉంటుందని మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌ రావు చెప్పారు. ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా భారతీయతను వదులుకోకూడదని డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ బౌద్ధమతంలో చేరారని గుర్తు చేశారు. శ్రీపాద రావు అప్పట్లో ఎల్లంపల్లి ప్రాజెక్టు కోసం ఎంతో కృషి చేశారని, అందుకే ఆ ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలని బీజేపీ తీర్మానం చేసిందని గుర్తు చేశారు. రథయాత్ర సమయంలో అశ్వమేధ యాగం చేస్తున్నారని ఆడ్వాణీని సీనియర్‌ ఎన్టీఆర్‌ మెచ్చుకున్నారని చెప్పారు.

పాలకపక్షం,ప్రతిపక్షం ఎప్పుడు ఒక్కటిగా ఉండాలని చెప్పారు. రేవంత్ రెడ్డి ఆలోచన బాగుందని ప్రశంసించారు. హైడ్రా మంచిదే…మూసీ పునరుజ్జీవనం హైదరాబాద్‌కు మంచి చేస్తుందని తెలిపారు. విద్యాసాగర్ రావు కుటుంబంలో ఎక్కువమంది వామపక్ష భావాలతో ఉన్నవారేనని  పేర్కొంటూ పేదల పట్ల, దళితుల పట్ల విద్యా సాగర్ రావు కమిట్మెంట్‌తో పని చేశారని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. 

జలాలు తెలంగాణకు రావాలని విద్యా సాగర్ రావు పరితపించారని పేర్కొంటూ .జల్, జంగల్, జమీన్ అనే కార్యక్రమాన్ని విద్యా సాగర్ రావు చేపట్టారని గుర్తుచేసుకున్నారు.  ఒడిస్సా గవర్నర్ కంభంపాటి హరిబాబు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర మంత్రి డి శ్రీధర్ బాబు కూడా ప్రసంగించారు.