
గత పదేళ్ళలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఏడు రెట్లు పెరిగిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. అంతకు ముందు దశాబ్దంతో పోలిస్తే 2014 నుండి 2024 మధ్య కాలంలో డ్రగ్స్ రవాణా అధికంగా పెరిగిందని తెలిపారు. ‘మాదకద్రవ్యాల అక్రమ రవాణా, జాతీయ భద్రత’ అనే అంశంపై న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన సదస్సుకు ఆయన అధ్యక్షత వహిం చారు.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, 2024లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి), వివిధ రాష్ట్రాల పోలీసులు కలిపి రూ.16,914 కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. దేశ స్వాతంత్య్రం తర్వాత ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోవడం ఇప్పుడేనని మంత్రి పేర్కొన్నారు. అయితే డ్రగ్స్ సరఫరాను అడ్డుకోవడానికి బ్లాక్ వెబ్, క్రిప్టో కరెన్సీ, డ్రోన్లు పెద్ద ప్రతిబంధకాలుగా మారాయని అమిత్ షా చెప్పారు.
కానీ గుజరాత్‌లోని ముంద్రా పోర్టు నుంచి గతేడాది విదేశాల నుంచి వచ్చిన 3300 కిలోల నార్కొటిక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 2004-2014 మధ్య కాలంలో కేవలం 3,63,000కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోగా ప్రస్తుత దశాబ్ద కాలంలో పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయని పేర్కొన్నారు. ఏకంగా 24 లక్షల కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామని అమిత్ షా వెల్లడించారు.
లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థలు డ్రగ్స్ రవాణాపై కఠినమైన పోరాటం చేస్తున్నాయని, అందు వల్లే గతేడాది కాలంలో అన్ని రికార్డులను అధిగమించి డ్రగ్స్‌ను పట్టుకోగలిగామని చెప్పారు. 2004-2014 దశాబ్దంలో రూ.8,150కోట్ల విలువైన డ్రగ్స్‌ను నిర్వీర్యం చేయగా, 2014-2024 మధ్య కాలంలో ఏకంగా రూ.56,851 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థలు నిర్వీర్యం చేశాయని వెల్లడించారు.
ఇది, అంతకుముందు దశాబ్దంతో పోలిస్తే 8రెట్లు ఎక్కువని చెప్పారు. ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్యమంత్రులు, గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, సీనియర్ అధికారులు ఇతర ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థల సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
కేవలం డ్రగ్స్ మాత్రమే కాదని, వివిధ రాష్ట్రాల్లో తీవ్రవాద నెట్‌వర్క్‌లను కూడా భగం చేశామని అమిత్ షా తెలిపారు. జమ్మూ కాశ్మీర్, గుజరాత్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ మాదకద్రవ్యాల రవాణాతో ముడిపడి అనేక టెర్రర్ నెట్‌వర్క్‌లు పనిచేస్తున్నాయని చెప్పారు. జనవరి 11 నుండి 25 వరకు డ్రగ్ డిస్పోజల్ ఫోర్ట్‌నైట్ (మాదకద్రవ్యాల నిర్వీర్య పక్షోత్సవాలు)ను నిర్వహిస్తుని పేర్కొన్నారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.8,600కోట్ల విలువైన లక్ష కిలోల డ్రగ్స్‌ను ఈ పక్షం రోజుల్లో నిర్వీర్యం చేయనున్నారు. 2047కల్లా మాదకద్రవ్యాల రహిత భారతదేశాన్ని రూపొందించడం లక్ష్యమని హోం మంత్రి పేర్కొన్నారు. ఇందుకోసం మూడంచెల వ్యూహాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.
సంస్థాగతమైన యంత్రాంగాలను బలోపేతం చేయడం, నార్కొటిక్స్ సంస్థల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం, ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం తీసుకువచ్చే కార్యక్రమాలు చేపట్టడం ఈ వ్యూహాంలో భాగంగా వున్నాయని చెప్పారు. రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం, సాంకేతిక నిపుణుల సమిష్టి కృషి ద్వారా ఈ సమస్యలకు ఒక సాంకేతిక పరిష్కారం కనుగొనాలని కోరారు.
More Stories
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
‘మోహన్‌లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు