
దేశంలోకి వ్యాపించిన హ్యూమన్ మెటా ప్న్యూమో వైరస్ (హెచ్‌ఎంపీవీ) కొత్తది కాదని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు. 2001లో గుర్తించిన ఈ వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇద్దరు శిశువులు, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఒక చిన్నారి, పశ్చిమ బెంగాల్‌లో ఒకరికి హెచ్‌ఎంపీవీ సోకినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది.
దీంతో కరోనా మాదిరిగా చైనాను వణికిస్తున్న ఈ వైరస్ దేశంలోకి వ్యాపించడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోసారి లాక్‌డౌన్ పరిస్థితికి దారి తీయవచ్చన్న భయాందోళనలను రేకెత్తిస్తున్నది. దానితో హెచ్‌ఎంపీవీ వైరస్ వ్యాప్తి, కేసుల నమోదుపై కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా సోమవారం సమీక్షించారు.
అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ హెచ్‌ఎంపీవీ కొత్త వైరస్ కాదని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేసినట్లు తెలిపారు. తొలిసారి 2001లో ఈ వైరస్‌ను గుర్తించినట్లు తెలిపారు. నాటి నుంచి చాలా ఏళ్లుగా ప్రపంచం మొత్తం ఇది వ్యాపిస్తోందని చెప్పారు. శ్వాసక్రియ ద్వారా గాలిలోకి హెచ్‌ఎంపీవీ వ్యాపిస్తుందని అన్నారు. ఇది అన్ని వయసుల వ్యక్తులను ప్రభావితం చేస్తుందని తెలిపారు. శీతాకాలం, వసంత ఋతువు ఆరంభంలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుందని పేర్కొన్నారు.
మరోవైపు చైనాతోపాటు పొరుగు దేశాల్లో ఈ వైరస్ కేసుల నమోదు, పరిస్థితిని ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కలిసి నిశితంగా గమనిస్తున్నాయని జేపీ నడ్డా తెలిపారు. ప్రజల ఆరోగ్యం కోసం అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తి పరిస్థితిని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గమనిస్తున్నదని, ఆ నివేదికలను అందజేస్తుందని వెల్లడించారు.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు