
* భారత్ వ్యతిరేక వైఖరితోనే ట్రూడో పతనం!
కెనడా ప్రధానమంత్రి పదవికి, అధికార లిబరల్ పార్టీ ఆఫ్ కెనడా అధినేత పదవికి రాజీనామా చేస్తున్నట్టు జస్టిన్ ట్రూడో ప్రకటించారు. సోమవారం ఒట్టావాలోని తన నివాసం వద్ద ఆయన మీడియా సమావేశంలో తాను రాజీనామా చేస్తానని తన పార్టీకి, గవర్నర్‌కు తెలియజేసినట్టు తెలిపారు. కొత్త ప్రధాని ఎన్నిక వరకు తాను ఈ పదవుల్లో కొనసాగుతానని చెప్పారు.
ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల వరకు పార్టీని, కెనడాకు నాయకత్వం వహించే కొత్త నేత ఎన్నిక ప్రక్రియను ప్రారంభించేందుకు వీలుగా జనవరి 27న ప్రారంభం కావాల్సిన పార్లమెంటును మార్చి 24 వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
‘నేను ఏ పోరాటం నుంచి అంత సులువుగా వెనక్కు తగ్గను. కానీ, కెనడియన్ల ప్రయోజనాలు, నేను ప్రేమించే ప్రజాస్వామ్య శ్రేయస్సు కోసం రాజీనామా చేస్తున్నాను’ అని ట్రూడో ప్రకటించారు. కెనడాలో అధికార పార్టీ అధినేత రాజీనామా తర్వాత కొత్త నాయకుడి ఎన్నికకు 90 రోజుల గడువు ఉంటుంది. ఈ నేపథ్యంలో తొమ్మిదేండ్ల జస్టిన్ ట్రూడో పాలనకు మరో 90 రోజుల్లోపే తెరపడనుంది.
సొంత పార్టీలో, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతతోనే జస్టిన్ ట్రూడో తన పదవిని వదులుకోవాల్సి వస్తున్నది. ఇటీవల వెలువడిన ఒపీనియన్ పోల్స్‌లో ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీకి ప్రజల మద్దతు భారీగా పెరిగిందని తేలింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు తన పదవిని వదులుకోక తప్పని పరిస్థితి ట్రూడోకు ఏర్పడింది. ట్రూడో కొన్ని రోజులుగా రాజకీయంగా గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు.
అధికార పార్టీకి కీలక భాగస్వామిగా ఉన్న న్యూ డెమాక్రటిక్ పార్టీ మద్దతు సెప్టెంబర్‌లో ఉపసంహరించుకుంది. దీంతో చిన్న పార్టీల మద్దతుతో అతి కష్టం మీద అవిశ్వాస తీర్మానంలో ట్రూడో నెగ్గారు. ట్రూడో విధానరపరమై విభేదాలతో డిసెంబర్లో కెనడా ఆర్థిక మంత్రి రాజీనామా ట్రూడోకు మరో దెబ్బ. దేశంలో వృద్ధి కుంటుపడటం, ద్రవ్యోల్బణం పెరగడంతో ఆర్థిక సంక్షోభం కూడా ట్రూడోకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో సొంత పార్టీలోనే ఆయన తప్పుకోవాలనే డిమాండ్లు మొదలయ్యాయి. ఇలా వరుస ఎదురుదెబ్బల నేపథ్యంలో ఎట్టకేలకు ట్రూడో తన బాధ్యతల నుంచి వైదొలగనున్నట్టు ప్రకటించారు.
2013లో పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఆయన ప్రధాని పదవిని చేపట్టారు. ఇక గత పదేళ్లుగా పదవిలో ఉన్న ట్రూడో ప్రాభవం ఇటీవలి కాలంలో మసకబారుతూ వస్తున్నది. పెరుగుతున్న ధరలు, ఇళ్ల సంక్షోభానికి కారణమైన ట్రూడోపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఆయన నాయకత్వాన్ని మార్చాలంటూ సొంత పార్టీ నేతల నుంచే ఒత్తిడి తీవ్రంగా ఉంది.
లిబరల్ పార్టీలో ఒంటరిగా మారిన ట్రూడో, క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ, పార్టీలో పెరుగుతున్న అసమ్మతి వంటి దేశీయ సమస్యల నుంచి దృష్టిని మళ్లించేందుకు భారతదేశంపై ఆరోపణలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ట్రూడో రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 20 మంది కంటే ఎక్కువ మంది ఎంపీలు సంతకం చేసినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.
జస్టిన్ ట్రూడో కెనడాకు 23వ ప్రధాని. ఆయన తండ్రి పియెర్రె ట్రూడో సైతం కెనడాకు 16 ఏండ్లు ప్రధానిగా పని చేశారు. 2015లో జస్టిన్ కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. రాజకీయాల్లోకి రాకముందు ట్రూడో సాదాసీదా జీవితం గడిపారు. టీచర్‌గా, నైట్‌క్లబ్‌లో బౌన్సర్‌గా, స్నోబోర్డు శిక్షకుడిగానూ పని చేశారు.
కెనడాలోని ఖలిస్థానీల పట్ల ఉదాసీన వైఖరిని అవలంబించి వేర్పాటువాద శక్తులకు అనుకూలుడిగా జస్టిన్ ట్రూడో ముద్రపడ్డారు. తన పదవీకాలం చివర్లో ఆయన భారత్‌తో కయ్యానికి దిగారు. ఖలిస్థానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత దౌత్యవేత్తలు, నాయకుల ప్రభావం ఉందని ట్రూడో, ఆయన యంత్రాంగం ఆరోపించడం రెండు దేశాల మధ్య దౌత్యపరమైన సంక్షోభాన్ని తీసుకొచ్చింది.
భారతీయుల పట్ల ఇమ్మిగ్రేషన్ విధానాలనూ ఆయన కఠినంగా మార్చే ప్రయత్నం చేశారు. అయితే, భారత్ ట్రూడో ఆరోపణలను ఖండించింది. నిజ్జర్ హత్య కేసులో తగిన ఆధారాలు అందించడంలో కెనడా విఫలమైంది అని విమర్శకులు పేర్కొన్నారు. ట్రూడో ఆరోపణలు భారతదేశం విమర్శలను ఎదుర్కోవడానికి తీసుకున్న వ్యూహం అని, ఇది కెనడాలో రాజకీయ ప్రయోజనాలను బలపరచే యత్నం అని భావిస్తున్నారు. ఈ ఆరోపణలు ట్రూడో కోసం విపరీత ప్రతికూలతను సృష్టించాయి. పైగా, ఆయన పాలనకు కష్టసాధ్యంగా మారుతున్నాయి.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్