బిజెపి మాత్రమే ఢిల్లీని అభివృద్ధి చేయగలదు

బిజెపి మాత్రమే ఢిల్లీని అభివృద్ధి చేయగలదు
దేశ రాజధాని ఢిల్లీని బిజెపి మాత్రమే అభివృద్ధి చేయగలదని చెబుతూ తమ ఉజ్వల భవిష్యత్ కోసం ఢిల్లీ ప్రజలు బిజెపికి ఓ సారి అవకాశం ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, రోహిణిలో బిజెపి పరివర్తన్ యాత్రను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ ఢిల్లీ ప్రజల సంక్షేమం కోసం బిజెపి పనిచేస్తుందని హామీ ఇచ్చారు.
 
 “మనం 2025 సంవత్సరంలో ఉన్నాము. 21వ శతాబ్దంలో 25 సంవత్సరాలు గడిచాయి. అంటే పావు శతాబ్దం గడిచిపోయింది. ఈ సమయంలో, రెండు లేదా మూడు తరాల యువత ఢిల్లీలో పెరిగారు. ఇప్పుడు రాబోయే 25 సంవత్సరాలు భారతదేశ భవిష్యత్తుకు, ఢిల్లీ భవిష్యత్తుకు చాలా ముఖ్యమైనవి”  అని ప్రధాని చెప్పారు.
 
ఎందుకంటే ఈ సంవత్సరాలు భారతదేశం ‘విక్షిత్ భారత్’గా మారుతుందని ఆయన పేర్కొన్నారు. “ఈ రోజు, నేను ఢిల్లీలో వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించాను, శంకుస్థాపన చేసాను. రాబోయే 25 సంవత్సరాలు భారతదేశం, ఢిల్లీకి చాలా కీలకం; ఈ సంవత్సరాలు భారతదేశం ‘విక్షిత్ భారత్’గా మారుతుంది” అని ఆయన తెలిపారు.
 
గత పదేళ్లలో ‘విపత్తు’ (ఆప్-దా)నే చూశామని చెబుతూ అభివృద్ధేనే ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నారని, ప్రజల కోసం బీజేపీ పనిచేస్తుందని నమ్మకం ప్రజలకు ఉందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజావిశ్వాసం చూరగొనడం వల్లే హర్యానా, ఒడిశా, మహారాష్ట్ర వంటి పలు ఎన్నికల్లో పార్టీ గెలుపొందిందని పేర్కొంటూ ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుస్తుందనే గట్టి నమ్మకం ఉందని స్పష్టం చేశారు.
 
“ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధాని నగరంగా ఢిల్లీకి గుర్తింపు ఇవ్వగలిగేది బిజెపి మాత్రమే. ఢిల్లీ ప్రజల హృదయాలను గెలుచుకుని, ఢిల్లీ నుండి ఈ `ఆపద’ను తొలగించడానికి ఇదే సరైన సమయం” అని ఆయన పిలుపిచ్చారు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని, ‘ఆప్డా’ ప్రభుత్వానికి ఢిల్లీని అభివృద్ధి చేయాలనే దార్శనికత లేదని, ‘ఆప్డా’కు ఏ బాధ్యత అప్పగించినా ఢిల్లీ ప్రజలకు శిక్ష అని ఆయన ధ్వజమెత్తారు.
 
“ఢిల్లీ ప్రజల అభివృద్ధి కోసం ఈ ‘ఆపద’ ప్రభుత్వానికి దార్శనికత లేదు. నేటికీ, ఢిల్లీలోని అన్ని అభివృద్ధి పనులు కేంద్ర ప్రభుత్వమే చేస్తున్నాయి. ఢిల్లీ మెట్రో ఢిల్లీలోని ప్రతి మూలకు చేరుకుంది. ఈ పని బిజెపి చేసింది. ఈ నమో రైలు సర్వీసు, హైవేలు, ఫ్లైఓవర్లు, ప్రతిదీ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద, కేంద్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ళు నిర్మించడానికి డబ్బు ఇస్తుంది” అని ఆయన వివరించారు.