
రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్ నిరాహార దీక్ష చేస్తున్నారు. బీహార్ పబ్లిక్ సర్వీసెస్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థులకు సంఘీభావంగా ఈ దీక్ష చేపట్టారు. జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడైన ప్రశాంత్ కిషోర్ పాట్నాలోని గాంధీ మైదాన్‌లో గాంధీ విగ్రహం వద్ద జనవరి 2 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. పేపర్ లీక్ అయ్యిందన్న ఆరోపణల నేపథ్యంలో అభ్యర్థుల నిరసనకు ఈ మేరకు మద్దతు తెలిపారు.
ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఖరీదైన లగ్జరీ వ్యానిటీ వ్యాన్ నిరసన ప్రాంతం సమీపంలో పార్క్ చేసి ఉంది. కోట్ల విలువైన ఈ వాహనంలో ఇంటికి సంబంధించిన కిచెన్, బెడ్ రూమ్, ఏసీతో సహా అన్ని సౌకర్యాలున్నాయి. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్‌కు చెందిన లగ్జరీ వాహనం నిరసన ప్రాంతం వద్ద ఉండటంపై అనుమానాలతోపాటు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో పేపర్ లీకేజ్ అయి నష్టపోతున్న అభ్యర్థుల మద్దతుగా ప్రశాంత్ కిషోర్ చేస్తున్న నిరాహార దీక్ష నిజం కాదని, ఆయన ఆ దీక్ష చేస్తున్నట్లు నటిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ వాహనం ఉద్దేశ్యం గురించి ప్రశ్నించగా, 47 ఏళ్ల మాజీ రాజకీయ వ్యూహకర్త, “మనం ఎక్కడ రిలీవ్ అవుతాము అనేది బిపిఎస్సీ అభ్యర్థుల భవిష్యత్తు కంటే ముఖ్యమా?” అని ఆశ్చర్యపోయారు. “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేదా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను వారు అనుభవిస్తున్న సౌకర్యాల గురించి మీరు ప్రశ్నించగలరా?” అని కిషోర్ అడిగారు.
ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో డిసెంబర్ 13న జరిగిన 70వ కంబైన్డ్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ (సిసిఇ)ను రద్దు చేయాలని జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు డిమాండ్ చేశారు. ఆ స్థలంలో జరిగిన నిరసన “చట్టవిరుద్ధం” అని పేర్కొన్న జిల్లా యంత్రాంగం కిషోర్, ఆయన “150 మంది మద్దతుదారుల”పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
పాట్నా హైకోర్టు ఆదేశం ప్రకారం, “గర్దానీ బాగ్‌లో నిర్దేశించిన స్థలంలో తప్ప వేరే చోట ధర్నాకు అనుమతి లేదు” అని జిల్లా మేజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ తెలిపారు. గర్దానీ బాగ్‌లో దాదాపు మూడు వారాలుగా అనేక మంది అభ్యర్థులు ప్రదర్శన నిర్వహిస్తున్నారు. “గురువారం ఆ స్థలాన్ని ఖాళీ చేయమని నోటీసు ఇచ్చిన కిషోర్, అతని మద్దతుదారులపై మేము తగిన చర్యలు తీసుకుంటాము” అని డిఎం తెలిపారు.
మరోవైపు జన్ సూరజ్ పార్టీ అధికార ప్రతినిధి వివేక్ ఈ వివాదంపై స్పందిస్తూ ‘ఇది సమస్య కాదు. అభ్యర్థుల భవిష్యత్తు సమస్య. నిరాహార దీక్ష చేస్తున్న ప్రశాంత్ కిషోర్ పరువు తీసేందుకు రాజకీయ ప్రత్యర్థులు వ్యానిటీ వ్యాన్‌ను ఉపయోగించుకుంటున్నారు. విద్యార్థులకు న్యాయం కోసం వారి డిమాండ్లపై దృష్టి సారించాలి’ అని కోరారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు