మధురైలో నటి ఖుష్బూతో సహా మహిళా మోర్చా నేతల అరెస్ట్

మధురైలో నటి ఖుష్బూతో సహా మహిళా మోర్చా నేతల అరెస్ట్

అన్నా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్‌ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనపై డీఎంకే ప్రభుత్వం నిందితులకు అనుకూలంగా వ్యవహరిస్తుందంటూ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఉమారతి నేతృత్వంలో బీజేపీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలు, ప్రముఖ నటి ఖుష్బూ సుందర్ ఆధ్వర్యంలో మదురైలో శుక్రవారం నిరసన ప్రదర్శన చేశారు.

 మదురై నుంచి చెన్నై వరకు పాదయాత్ర చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసుల అనుమతి లేకుండా ఈ నిరసన జరుపటంతో ఖుష్బూ సహా అందరినీ అరెస్టు చేశారు. మహిళా మోర్చా కార్యకర్తలు ఓ భారీ వ్యాన్‌లో బయలుదేరటానికి సిద్ధమయ్యారు. ఆ వ్యాన్‌ యాత్రకు ఖుష్బూ జెండా ఊపి ప్రారంభించారు. చెన్నైకు చేరుకొని గవర్నర్ ఆర్ ఎన్ కి వినితిపత్రం సమర్పించాలని అనుకున్నారు.

అనుమతి లేకుండా జరిగిన ఈ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసు బలగాలు తీవ్రంగా ప్రయత్నించాయి. మహిళా కానిస్టేబుళ్లు ఆందోళనలో పాల్గొన్న ఖుష్బూ, ఇతర మహిళా నాయకులు, కార్యకర్తలు సుమారు 500 మందిని అరెస్టు చేసి వ్యాన్లలో తరలించారు.

ఆందోళనలో పాల్గొన్న బీజేపీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలు ఖుష్బూ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని చోట్లా మహిళలకు భద్రతలేకుండా పోయిందని, విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌  క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. స్టాలిన్‌ సారీ చెప్పేంత దాకా తమ పోరాటం ఆగదని కూడా ఆమె హెచ్చరించారు.

అన్నా విశ్వవిద్యాలయంలో విద్యార్థిని అత్యాచారం, హత్య ఘటనను రాజకీయం చేయవద్దని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేయడానికి ముందే ఈ నిరసన పాదయాత్ర కార్యక్రమాన్ని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు అన్నామలై ప్రకటించారు.