దట్టమైన పొగమంచుతో వందలాది విమానాలు ఆలస్యం

దట్టమైన పొగమంచుతో వందలాది విమానాలు ఆలస్యం
దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఢిల్లీ సహా హర్యానా, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, బీహార్‌ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. దీంతో దట్టమైన పొగమంచు కమ్మేసింది . పొగమంచు కారణంగా వందలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైల్వే సేవలకు కూడా అంతరాయం కలిగింది. ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోవడంతో విమాన, రైల్వే సేవలకు అంతరాయం ఏర్పడింది. 
 
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విజిబిలిటీ సున్నాకు పడిపోవడంతో విమానాశ్రయంలో సేవలకు తాత్కాలికంగా నిలిపివేశారు.  దీంతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు రాకపోకలు సాగించే దాదాపు 250 విమానాలు ఆలస్యమయ్యాయి. 40 విమానాలను అధికారులు రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.
 
”పొగమంచు కారణంగా ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలపై ప్రభావం పడింది. విమాన సమయాల కోసం ప్రయాణికులు ఎప్పటికప్పుడు సంబంధిత ఎయిర్‌లైన్లను సంప్రదించాలి” అని ఎయిర్‌పోర్టు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.  అటు ఇండిగో, ఎయిర్‌ఇండియా సంస్థలు కూడా ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి. అటు కోల్‌కతా, చండీగఢ్‌, అమఅత్‌సర్‌, జైపుర్‌ సహా ఉత్తర భారతంలోని పలు విమానాశ్రయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

ఇక కోల్‌కతా విమానాశ్రయంలో 40 విమాన సర్వీసులు ఆలస్యం అయ్యాయి. మరో ఐదు విమానాలను రద్దు చేసినట్లు ఫ్లైట్ మానిటరింగ్ ప్లాట్‌ఫాం ఫ్లైట్‌రాడార్ తెలిపింది. చండీగఢ్, అమృత్‌సర్, ఆగ్రా సహా ఉత్తరాదిలోని ఇతర విమానాశ్రయాల్లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ఆయా విమానాశ్రయాల్లో విజిబిలిటీ జీరోగా నమోదైంది.

మరోవైపు, రైల్వే సేవలు కూడా నెమ్మదిగా సాగుతున్నాయి.   ప్రస్తుత సమాచారం ప్రకారం.. వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి వచ్చే 50కిపైగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. న్యూఢిల్లీ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (22436) దాదాపు నాలుగు గంటల కంటే ఎక్కువ ఆలస్యంగా నడుస్తోంది. వారణాసి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ 14 గంటలు, మరో న్యూఢిల్లీ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎనిమిది గంటల 17 నిమిషాలు, ఆనంద్ విహార్ టెర్మినల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఏడు గంటలకు పైగా ఆలస్యంగా నడుస్తోంది.
 
ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌, కర్నాల్‌, గాజియాబాద్‌ తదితర ప్రాంతాల్లో ఎదురుగా ఉన్న వాహనాలు కూడా కన్పించని పరిస్థితి ఉంది. దీంతో వాహనాల రాకపోకలపై ప్రభావం పడి పలుచోట్ల ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. ఢిల్లీలో శనివారం తెల్లవారుజామున 10.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. జనవరి 8వ తేదీ వరకు దేశ రాజధానిలో మంచు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మధ్యలో తేలికపాటి వర్షాలు కూడా పడొచ్చని తెలిపింది.