జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై బిజెపి నేతల కన్నెర్ర

జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై బిజెపి నేతల కన్నెర్ర

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలతో బీజేపీ, టీడీపీ నేతల మధ్య ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. తాడిపత్రిలో ఉండే మహిళల కోసం నూతన సంవత్సరం సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి అర్ధరాత్రి ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.  ఆ విధంగా మహిళలకు అర్ధరాత్రి కార్యక్రమం నిర్వహిస్తే తాడిపత్రి వంటి చోట వారి భద్రతకు  ఎవ్వరు హామీ ఇస్తారు అంటూ బిజెపి నేత, సినీ నటి మాధవీలత ప్రశ్నించారు. దానితో ఆమెపై ప్రభాకర్ రెడ్డి అనుచిత వాఖ్యలకు దిగడంతో బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు.

మరోవంక జేసీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు దగ్ధమైంది. దీని వెనుక బీజేపీ నేతల హస్తం ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. దీంతో బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా జేసీ ప్రభాకర్ రెడ్డి తీరును తప్పుబడుతున్నారు. కూటమిలో ఉంటూ తమపై ఇలా మాట్లాడటం తగదని బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల మాధవిలత విచారం వ్యక్తం చేస్తూ “ఆ వయసు అయిపోయిన మనిషి మాట్లాడిన గొప్ప భాషకు ధన్యవాదాలు.. ఆయనకు సపోర్ట్ చేస్తున్న వారికి సంతాపం” అంటూ పేర్కొన్నారు. “నన్ను చంపాలనుకుంటే చంపొచ్చు. మహిళల మాన ప్రాణాల విషయంలో వెనక్కి తగ్గను. ఒంటరిగానైనా పోరాడతాను” అని ఆమె స్పష్టం చేశారు.
 
“సినిమాలలో ఉన్న వాళ్లంతా ప్రాస్టిట్యూట్లని ఆయన చెప్పారు కాబట్టి ఆ జిల్లా నుంచి ఎవరు ఇండస్ట్రీకి రావద్దు” అంటూ మాధవి లత సూచించారు. మహిళలు సురక్షితంగా ఉండాలని చెప్పడమే తాను చేసిన తప్పా? అంటూ ఆమె ప్రశ్నించారు. వయసులో పెద్దవారైనా ఆయన గౌరవప్రదమైన మాటలు మాట్లాడాలని, అసభ్య పదాలు వాడడం దారుణమని  ఆమె మండిపడ్డారు. ఆయన భాషను బట్టి ఆయన వ్యక్తిత్వం ఏంటో ప్రజలకు తెలుస్తుందని ఆమె ఎద్దేవా చేశారు.

తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీపై జేసీ ప్రబాకర్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదని పేర్కొంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఏం మాట్లాడతారో ఆయనకే తెలీదని విమర్శించారు. జేసీ వ్యాపారాలపై గతంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయని చెబుతూ కూటమిలో ఉన్న బీజేపీపై జేసీ ప్రభాకర్‌రెడ్డి అర్థంలేని వ్యాఖ్యలు చేయడం సరికాదని మంత్రి సత్యకుమార్ తెలిపారు. జేసీ ఆయన వయసుకు తగిన విధంగా నడుచుకోవాలని మంత్రి సత్యకుమార్ హితవు పలికారు.

బీజేపీ నేతలపై వరుస ఆరోపణలు సంధిస్తున్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎమ్మెల్యే పార్థసారథి మండిపడ్డారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని పేర్కొంటూ బీజేపీ వాళ్లే బస్సులు కాల్చేశారని ఆయన అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఆయన హెచ్చరించారు. 

ఎక్కడో కూర్చొని నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే చూస్తూ కూర్చొనే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరని ఆయన స్పష్టం చేశారు. ఆయనకు మహిళలను గౌరవించే సంప్రదాయం కూడా లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను తప్పు పట్టారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్, జేసీ ప్రభాకర్ రెడ్డిలు గత ఐదేళ్లుగా తిట్టుకొన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

కానీ నేడు వైఎస్ జగన్ బెటరంటున్నారని బిజెపి ఎమ్యెల్యే అసహనం వ్యక్తం చేశారు. బస్సు దగ్ధంపై పోలీస్ కేసు పెట్టానని అంటున్నారని అంటూ వ్యవస్థలను గౌరవించాలంటూ జేసీకి పార్థసారథి సూచించారు. అంతేకానీ వ్యవస్థలను నమ్మను అనడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహారాన్ని టీడీపీ అధిష్టానం దృష్టికి, అలాగే బీజేపీ అధ్యక్షరాలు దుగ్గుబాటి పురందేశ్వరి దృష్టికి తీసుకు వెళ్తామని స్పష్టం చేశారు.

దేశంలోనే బీజేపీ పెద్ద పార్టీ అని గుర్తు చేశారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలు అహంకారంతో కూడిన మాటలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతానంటే కుదరదని హెచ్చరించారు. ఒకే కూటమిలో ఉన్నామని, మిత్ర పక్షంలో ఉన్నామని వివరించారు. ఈ నేపథ్యంలో ఓ వేళ బస్సులు కాల్చారని అనుమానం ఉంటే పోలీస్ కేసు పెట్టాలని జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యే పార్థసారథి హితవు పలికారు.