
రాబోయే ఐదేళ్లలో ఢిల్లీని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. దేశ రాజధాని రవాణా నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసేందుకు, కాలుష్యాన్ని తగ్గించేందుకు రూ.12,500కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు.
గత నవంబర్ నుంచి ఢిల్లీలో కాలుష్య స్థాయి ఎక్కువగానే ఉన్నది. కాలుష్యాన్ని తగ్గించేందుకు పలు చర్యలు తీసుకోవడంతో పాటు ఢిల్లీలో బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ కార్లను రెండుసార్లు నిషేధించారు. ఇటీవల గాలి నాణ్యత సూచీ 350 వరకు చేరింది. కమీషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (సిఎక్యూఎం) గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ 3 కింద ఆంక్షలు మళ్లీ తీసుసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇందులో భాగంగా కార్లపై మరోసారి నిషేధం విధించే అవకాశం ఉంది. అయితే, ఢిల్లీలోని వాతావరణ కాలుష్యానికి కారణాల్లో వాహనాలు ఉద్గారాలు సైతం ఒకటి. ఢిల్లీ రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు, కాలుష్యాన్ని తగ్గించేందుకు రూ.12,500కోట్ల పెట్టుబడిని కేంద్ర మంత్రి తెలిపారు. అదనంగా రూ.12500 కోట్ల సీఆర్ఐఎఫ్ ఫండ్‌ని సైతం ప్రకటించారు.
ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి రహదారుల మంత్రిత్వ శాఖ ఏయే ప్రాజెక్టులను ప్రారంభించబోతుందో ఆయన వివరించారు. వాయు కాలుష్యం, ట్రాఫిక్ జామ్‌లతో ఢిల్లీ ఇబ్బందులపడుతుందని పేర్కొంటూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఢిల్లీని ఆయా సమస్యల నుంచి గట్టెక్కించేందుకు ప్రాజెక్టులను ప్రారంభించిందని చెప్పారు.
ఢిల్లీలోకి ప్రవేశించే వాహనాల ఒత్తిడిని తగ్గించేందుకు కొత్త రోడ్డు ప్రాజెక్టులు ఎంతో దోహదపడుతాయని పేర్కొన్నారు. కాలుష్యాన్ని క్లీన్ ఎనర్జీ ద్వారా తగ్గించనున్నట్లు తెలిపారు. ఢిల్లీ కాలుష్యంలో 40శాతం శిలాజ ఇంధనాల వినియోగమే కారణమని చెబుతూ దాంతో ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులు, కార్లు, స్కూటర్లు, సీఎన్జీ వాహనాలను తీసుకువచ్చామని గుర్తు చేశారు. రాబోయే ఐదేళ్లలో ఢిల్లీని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.కొత్త రోడ్ నెట్‌వర్క్‌తో వాహనాల రద్దీ తగ్గుతుందని భరోసా వ్యక్తం చేశారు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ (ఐజిఐ) చుట్టూ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఇప్పటికే ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించిందని, అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్ ప్రాజెక్ట్ కింద ఢిల్లీ-కత్రా ఎక్స్‌ప్రెస్ వేతో కుండ్లి మనేసర్ పాల్వాల్ ఎక్స్‌ప్రెస్ వే లేదంటే వెస్ట్రన్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్ వే ద్వారా కనెక్టివిటీని అందించే ఫేజ్-2ని మంత్రిత్వ శాఖ ఖరారు చేస్తోందని వెల్లడించారు.
ఆయా రోడ్‌నెట్ వర్క్‌ల ద్వారా జమ్మూ కశ్మీర్, పంజాబ్ నుంచి వచ్చే వాహనాలు నేరుగా విమానాశ్రయం, ఢిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వేకు చేరుకునేలా ఉపయోగకరంగా ఉంటాయని గడ్కరీ తెలిపారు. కొత్త రోడ్ నెట్వర్క్ ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేకి నేరుగా కనెక్టివిటీని అందిస్తుందని, దాంతో రాజధానిలో రద్దీని తగ్గించడంలో సహాపడుతుందని చెప్పారు.
మహిపాల్పూర్, రంగ్‌పురి ప్రాంతాల్లో రోజువారీ ట్రాఫిక్ జామ్‌ను నివారించేందుకు ఐదు కిలోమీటర్ల పొడవైన సొరంగాన్ని నిర్మించే యోచనలో ఉన్నట్లు గడ్కరీ వివరించారు. రూ.3,500 కోట్లతో ఈ సొరంగాన్ని నిర్మించనున్నారు. ఈ సొరంగం వసంత్ కుంజ్‌లోని శివమూర్తి, నెల్సన్ మండేలా మార్గ్‌లను కలుపుతుంది.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు