చైనాలో కరోనా తరహా మరో కొత్త వైరస్ కలకలం

చైనాలో కరోనా తరహా మరో కొత్త వైరస్ కలకలం

* నోరు మెదపని చైనా, డబ్ల్యూహెచ్‌వో

కరోనా విలయం నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం కోలుకుంటున్న తరుణంలో కరోనా వైరస్‌కు మూలమైన చైనాలో మరో మహమ్మారి వ్యాప్తి చెందుతున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ హ్యూమన్‌ మెటాప్న్యూమోవైరస్‌ (హెచ్‌ఎంపీవీ) తీవ్రంగా వ్యాప్తి చెందిందని, కరోనా వెలుగులోకి వచ్చిన సరిగ్గా ఐదేండ్ల తర్వాత మరో ప్రమాదకర వైరస్‌ వ్యాప్తి చెందుతున్నదని స్థానిక, సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. 
 
ఈ వ్యాధి కారణంగా అక్కడి దవాఖానలు రోగులతో, మృతులతో శ్మశానాలు నిండిపోతున్నాయని కొందరు ఆందోళన చెందుతున్నారు.  ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ప్రజలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. ఈ క్రమంలో కరోనా, ఇన్‌ఫ్లూయెంజా ఏ, హెచ్‌ఎంపీవీ, మైకో ప్లాస్మా నిమోనియా లాంటి బహుళ శ్వాసకోస వైరస్‌ల తీవ్ర వ్యాప్తిపై ఒకరికొకరు హెచ్చరికలు చేసుకుంటున్నారు. 

ఈ క్రమంలో చైనాలో అత్యవసర పరిస్థితి ప్రకటించారని ప్రచారం జరిగినా అధికారికంగా దానినెవరూ నిర్ధారించ లేదు. ఈ వ్యాధి హెచ్‌ఎంపీవీ ఫ్లూ లాంటి వ్యాధి లక్షణాలతో ఉంటుందని, కరోనా వ్యాధి లక్షణాలు కూడా ఉంటాయని డాక్టర్లు తెలిపారు. ఆరోగ్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ వైరస్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టారు.

ఇన్‌ఫ్లూయెంజా ఏ, హెచ్‌ఎంపీవీ, మైకోప్లాస్మా నిమోనియా, కరోనా వైరస్‌లు దేశంలో విజృంభిస్తున్నాయి. దవాఖానాలు రోగులతో నిండిపోతున్నాయి. శ్మశానాలకు కూడా తాకిడి పెరిగింది. నిమోనియో, వైట్‌ లంగ్‌ కేసులతో పిల్లల దవాఖానలు నిండిపోతున్నాయి’ అని ఎక్స్‌లో ఒక చైనా పౌరుడు పోస్ట్‌ చేశాడు. 

కాగా, చైనాలో వ్యాధుల నియంత్రణ సంస్థను ఉటంకిస్తూ రాయిటర్స్‌ ఒక వార్తా కథనాన్ని వెలువరించింది. తెలియని మూలకం ఉన్న నిమోనియా కోసం పర్యవేక్షణ వ్యవస్థను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నామని, శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధులు కేసులు పెరిగే అవకాశం ఉందని తమకు తెలియజేసినట్టు వెల్లడించింది.

అయితే చైనాలో ప్రతి ఏడాది శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధులతో చేరే రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, ఈ ఏడాది నమోదైన కేసులు గత ఏడాది కన్నా తక్కువేనని ఒక వైద్యాధికారి తెలిపారు. హెచ్‌ఎంపీవీ వ్యాధి సోకిన వారు గుడ్డిగా యాంటీ వైరల్‌ డ్రగ్స్‌ వాడవద్దని, డాక్లర్ల పర్యవేక్షణలో చికిత్స పొందాలని, దీనికి వ్యాక్సిన్‌ లేదని, అయితే జలుబు వంటి వ్యాధి లక్షణాలు ఉంటాయని ఆయన తెలిపాడు.

హెచ్‌ఎంపీవీ, ఇతర వైరస్‌ వ్యాధుల గురించి జరుగుతున్న ప్రచారం చూస్తే కరోనా  లాంటి మరో మహమ్మారి కబళించడానికి సిద్ధంగా ఉందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ‘దీనిపై విశ్వసనీయమైన సమాచారం ఆరోగ్య శాఖ అధికారుల నుంచి వెలువడే వరకు మనం దీనిని నమ్మాల్సిన అవసరం లేదు’ అని ఉన్నతాధికారి పేర్కొన్నారు.

‘కొత్త అంటువ్యాధి ఉనికి గురించి చైనా ఆరోగ్య శాఖ అధికారులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎలాంటి నిర్ధారణ చేయలేదు. అత్యవసర పరిస్థితిని ప్రకటించ లేదు. సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నట్టు కొత్త అంటు వ్యాధి కనుక వ్యాపిస్తున్నట్టయితే దాని గురించి అధికారులు హెచ్చరిక ప్రకటనలు జారీ చేసేవారు కదా?’ అని కొందరు పేర్కొంటున్నారు.