వైసీపీ ప్రభుత్వంలో అధ్వానంగా సాగునీటి వ్యవస్థ

వైసీపీ ప్రభుత్వంలో అధ్వానంగా సాగునీటి వ్యవస్థ

వైసీపీ ప్రభుత్వంలో సాగునీటి వ్యవస్థను అధ్వానంగా మార్చారని బీజేపీ ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఇరిగేషన్ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గాడిలో పెడుతున్నారని చెప్పారు. నదుల అనుసంధానం దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆలోచన విధానమని ఆయన పేర్కొన్నారు. 

వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా నదుల అనుసంధానం చేయడం గేమ్ ఛేంజర్‌గానే పరిగణించాలని ఆయన చెప్పారు. 80 లక్షల జనాభాకు తాగునీరు, 7.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు, 22.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు స్థిరీకరణ, పరిశ్రమలకు 20 టీఎంసీల జలాలు అందించడం లక్ష్యంగా జలహారతిలో కార్యక్రమం రూపొందించామని ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు.

గోదావరి నీటిని కృష్ణా నదికి తరలించడం ద్వారా నదుల అనుసంధానం వేగవంతం చేయడం ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యమని ఎమ్యెల్యే ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కారణంగా ఏపీ వ్యాప్తంగా సస్యశ్యామలంగా మారుతుందని ఆయన తెలిపారు.

కాగా, జనవరి5 న దేవాలయాల పరిరక్షణ కోసం దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగానే విజయవాడలో హైందవ శఖారావం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతోందని ఎమ్మెల్యే పార్థసారథి వెల్లడించారు. మఠాధిపతులు, పీఠాధిపతులతో పాటు, రెండు లక్షల మంది ఈ కార్యక్రమానికి తరలి రానున్నారని తెలిపారు.

వైసీపీ ప్రభుత్వంలో హుండీ ఆదాయాలను పక్కదోవ పట్టించారని బిజెపి నేత మండిపడ్డారు. జగన్ ప్రభుత్వ చీకటి జీఓలతో ఆలయాల ఆదాయాలను వేరే విధంగా వినియోగించిందని ఆయన ఆరోపించారు. ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్‌కు దేవుడి మీద భక్తి ఉందో లేదో కానీ హుండీ మీద మాత్రం ఉందని ఆయన  విమర్శించారు. 

హుండీ డబ్బులు దేవుడికి కాకుండా సంక్షేమ పథకాలకు ఖర్చుపెడతున్నారని ఆయన చెప్పారు. చాలా దేవాలయాలు ధూపదీప నైవేద్యాలు అందక విలవిలలాడుతున్నాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా దేవాలయాలకే ఖర్చు చేయాలని విశ్వహిందూ పరిషత్ ఆలోచన అని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పేర్కొన్నారు.