పాక్‌ జైళ్లలోని 183 మంది భారతీయులను విడుదల చేయండి

పాక్‌ జైళ్లలోని 183 మంది భారతీయులను విడుదల చేయండి
 
* 8 మంది పాక్‌ పౌరులకు 20 ఏళ్లు జైలు

పాక్‌ జైళ్లలో మగ్గుతున్న 183మంది భారత జాలర్లు, పౌరులను తక్షణమే విడుదల చేసి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్‌ను కోరింది. పాకిస్తాన్‌ కస్టడీలో వున్న 18మంది పౌరులు, జాలర్లకు తక్షణమే కాన్సులార్‌ సాయం అందించాలని కూడా కోరినట్లు భారత విదేశాంగ శాఖ అధికారలు తెలిపారు.  2008లో కుదిరిన ఒప్పంద నిబంధనల మేరకు ప్రతి ఏటాది జనవరి 1వ తేదీన, జులై 1న ఇరు దేశాలు తమ వద్ద ఖైదీలుగా వున్న పౌర, జాలర్ల వివరాల జాబితాను మార్చుకుంటాయి. అందులో భాగంగా భారత్‌ అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. 

తమ కస్టడీలో వున్న 381మంది పౌరులు, 81మంది జాలర్ల వివరాలను భారత్‌, పాక్‌కు అందచేసింది. అలాగే పాకిస్తాన్‌ కూడా తమ వద్ద వున్న 49మంది పౌరులు, 217మంది జాలర్ల వివరాలను అందచేసిందని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. జాలర్లను వారి బోట్లతో సహా విడుదల చేసి, అప్పగించాలని భారత ప్రభుత్వం కోరింది.

ప్రస్తుతం తమ జైళ్ళలో 682మంది భారతీయులు వున్నారని పాకిస్తాన్‌ ధృవీకరించింది. మావనతా సంబంధమైన అంశాలను ప్రాధాన్యతా ప్రాతిపదికన పరిష్కరించేందుకు భారత్‌ కట్టుబడి వుందని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో తమ వద్ద వున్న 76మంది పౌరుల జాతీయతను ధృవీకరించాల్సిందిగా కూడా భారత్‌, పాకిస్తాన్‌ను కోరింది. వారిని పాకిస్తానీయులుగా భారత ప్రభుత్వం భావిస్తోంది.

మరోవంక, డ్రగ్స్‌ కేసులో ఎనిమిది మంది పాకిస్తాన్‌ పౌరులకు ముంబయి కోర్టు జైలు శిక్ష విధించింది. 2015లో దాదాపు రూ.7కోట్ల విలువైన 200 కిలోల డ్రగ్స్‌ కేసులో ఒక్కొక్కరికి 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద వీరిని దోషులుగా నిర్ధారించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వారికి శిక్షలు ఖరారు చేశారు. గరిష్ఠంగా 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.2లక్షల చొప్పున జరిమానా విధించారు.

2015లో గుజరాత్‌ తీరంలో హెరాయిన్‌ను తరలిస్తున్న బోటును భారత కోస్ట్‌గార్డు అధికారులు పట్టుకున్నారు. ఆ బోటులో 11 డ్రమ్ములు, గోధుమ వర్ణంలోని పొడితో కూడిన 20 ప్లాస్టిక్‌ పౌచ్‌లను గుర్తించారు. ఆ ప్యాకెట్లలోని పదార్థాన్ని గుర్తించగా.. హెరాయిన్‌ అని తేలింది. 

ఎనిమిది మంది పాకిస్తాన్‌ పౌరులతో పాటు మూడు శాటిలైట్‌ ఫోన్‌లు, జీపీఎస్‌ నావిగేషన్‌ చార్ట్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను సీజ్‌ చేశారు. నిందితులకు గరిష్ఠంగా శిక్ష విధించాలని, మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేసేవారికి ఈ తీర్పు హెచ్చరికగా ఉండేలా చూడాలని స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సుమేశ్‌ పుంజ్వానీ కోర్టును అభ్యర్థించారు. ఇరు పక్షాల వాదనలు విన్న జడ్జి ఈ కేసులో దోషులకు శిక్షలు ఖరారు చేశారు.