
గత ఏడాదిన్నరగా మణిపూర్ లో జాతుల మధ్య జరుగుతున్న హింసలో వందలాది మంది జనం ప్రాణాలు కోల్పోతూ, ఇప్పటికి మణిపూర్ రగిలిపోతున్నా ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఆ రాష్ట్రంలో ప్రకటించకపోవడం దుర్మార్గమని కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ తీవ్రంగా కొట్టిపారేసారు.
ఓ వైపు మణిపూర్ వాసులు సాయం కోసం ఆర్తనాదాలు చేస్తుంటే మోదీ మాత్రం విదేశీ పర్యటనలకు వెడుతున్నారని, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలా ఆపాలో తర్వాత ఆలోచించవచ్చు కానీ ముందు మణిపూర్ మంటలను చల్లార్చాలని కాంగ్రెస్ నేతలు చేస్తున్న డిమాండ్ లను ఆయన తోసిపుచ్చారు.
అసలు మణిపూర్ లో మంటలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని, 1992లో మణిపూర్ లో అల్లర్లు మొదలయ్యాయని ముఖ్యమంత్రి ఆరోపించారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పట్లో కేంద్ర హోంమంత్రిగా ఉన్న చిదంబరం మయన్మార్ తో, మయన్మార్ మిలిటెంట్లతో కుదుర్చుకున్న ఒప్పందంతో మణిపూర్ లో అల్లర్లకు బీజం పడిందని చెప్పారు.
1992- 97 మధ్య కాలంలో మణిపూర్ లోని నాగా, కుకీ తెగల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. జైరామ్ రమేశ్ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ సుదీర్ఘ పోస్టు పెట్టారు. అప్పట్లో ప్రధానిగా ఉన్న కాంగ్రెస్ నేత పీవీ నరసింహారావు మణిపూర్ లో పర్యటించారా? ఎందుకు పర్యటించలేదని కాంగ్రెస్ నేతలను బీరేన్ సింగ్ నిలదీశారు.
ఆ తర్వాత కూడా 1997- 98 మధ్య కాలంలో కుకీలు, పైతీల మధ్య గొడవలు జరిగి రాష్ట్రంలో 350 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. అప్పుడు ప్రధానిగా ఉన్న ఐకే గుజ్రాల్ మణిపూర్ లో పర్యటించారా? రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారా? అని ప్రశ్నించారు. కాగా, అంతకు ముందు మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణల పట్ల ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ ప్రజలకు క్షమాపణ చెప్పారు. పాత తప్పిదాలను మరచిపోయి శాంతియుతంగా, సుఖసంతోషాలతో సహజీవనం సాధించాలని పిలుపిచ్చారు.
ఇలా ఉండగా, గత 18నెలల నుండి అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో తాజాగా అనుమానిత దళాలు దాడులు చేశారు. కొత్త సంవత్సం బుధవారం తెల్లవారుజామున మణిపూర్‌లోని ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని కదంగ్‌బండ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. కాంగ్పోక్పి జిల్లాలోని వారి కొండ ప్రాంతాల నుండి మిలిటెంట్లు అధునాతన ఆయుధాలతో అనేక రౌండ్లు కాల్పులు జరిపారు.
తెల్లవారుజామున 1 గంటలకు ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని లోతట్టు కడంగ్‌బండ్ ప్రాంతంపై బాంబులు విసిరారని ఒక పోలీసు అధికారి తెలిపారు. పరిస్థితిని అదుపు చేసేందుకు అదనపు భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేసుకున్నప్పటికీ, ఆ ప్రాంతంలో మోహరించిన గ్రామ వాలంటీర్లు కాల్పులను తిప్పికొట్టారు. ఈ కాల్పుల్లో ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.
ఈ దాడితో ఇళ్లలో నివసిస్తున్న పలువురు గ్రామస్తులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిందని వారు తెలిపారు. ఇదిలా ఉండగా, మణిపూర్‌లోని బిష్ణుపూర్, తౌబల్ జిల్లాలలో సెర్చ్ ఆపరేషన్లలో భద్రతా దళాలు భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని బుధవారం పోలీసులు ప్రకటించారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు