దక్షిణ కొరియా అధ్యక్షుడికి అరెస్ట్ వారెంట్ 

దక్షిణ కొరియా అధ్యక్షుడికి అరెస్ట్ వారెంట్ 
 
* జీవిత ఖైదు లేదా మరణశిక్ష పడే అవకాశం!

అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్​ సుక్​ యోల్​ను అదుపులోకి తీసుకుని, ఆయన కార్యాలయంలో సోదాలు చేసేందుకు కోర్ట్​ వారెంట్లు జారీ చేసిందని ఆ దేశ అవినీతి నిరోధక సంస్థ తెలిపింది. యూన్​ దేశంలో మార్షలా ప్రకటించడం తిరుగుబాటును ప్రోత్సహించడమే అవుతుందా? లేదా? అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది.

ప్రతిపక్షాల నియంత్రణలో ఉన్న నేషనల్ అసెంబ్లీ డిసెంబర్​ 14న అధ్యక్షుడు యూన్​ సుక్​ యోల్ అభిశంసనకు ఓటువేశాయి. దీనితో అప్పటి నుంచి యూన్​ అధికారాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అయితే యూన్​ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలా లేదా తిరిగి నియమించాలా అనేది రాజ్యాంగ న్యాయస్థానం నిర్ణయిస్తుంది.

న్యాయవాదులతో పాటు పోలీసు, రక్షణ మంత్రిత్వశాఖ, అవినీతి నిరోధక శాఖల అధికారులతో కూడిన సంయుక్త బృందం – యూన్​ సుక్​ యోల్​ను విచారించాల్సి ఉంది. అయితే ఇప్పటికే మూడు సార్లు పిలిచినప్పటికీ యూన్​ విచారణకు హాజరుకాలేదు. దీనితో అధికారులు కోర్టును ఆశ్రయించి, అధ్యక్షుడి అరెస్ట్‌కు వారెంట్‌ జారీ చేయాలని కోరారు.

దీనితో కోర్ట్​ తాజాగా యూన్​ను అరెస్ట్ చేసేందుకు అనుమతిస్తూ వారెంట్ జారీ చేసింది. వాస్తవానికి దక్షిణ కొరియా అధ్యక్షుడికి క్రిమినల్ ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు ఉంటుంది. కానీ ఈ ఇమ్యూనిటీ – తిరుగుబాటు, రాజద్రోహం నేరాలకు వర్తించదు. విచారణలో నేరం నిరూపితం అయితే యూన్​కు జీవిత ఖైదు లేదా మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉంది.

యూన్‌ సుక్‌ యోల్‌ మార్షల్‌ లా ఉత్తర్వులు జారీ చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టినందుకు ఆయనకు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్‌ (జాతీయ అసెంబ్లీ)లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓటేయగా, కేవలం 85 మంది మాత్రమే వ్యతిరేకించారు. యూన్‌ను తప్పించాలా? లేదా కొనసాగించాలా? అనే అంశాన్ని రాజ్యాంగ న్యాయస్థానం 180 రోజుల్లోపు తేల్చనుంది.