వంట గదిలో కిటికీల ఏర్పాటుపై తాలిబన్ల నిషేధం

వంట గదిలో కిటికీల ఏర్పాటుపై తాలిబన్ల నిషేధం
అధికారంలోకి వస్తే మంచి పాలన అందిస్తామని చెప్పిన తాలిబన్లు ప్రస్తుతం అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. 2021 ఆగ‌స్టులో ఆఫ్ఘాన్‌ ను పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నప్పటి నుంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మరీ ముఖ్యంగా మహిళలపై అణచివేతను కొనసాగిస్తున్నారు. దేశంలో మహిళల హక్కులను కాలరాస్తున్నారు.
తాజాగా మహిళల విషయంలో తాలిబన్లు మరో కొత్త రూల్‌ను తీసుకొచ్చారు. ఇంట్లోని మహిళలు బయటివారికి కనిపించకుండా ఉండేలా కిటికీలు  ఏర్పాటు చేయొద్దని పాలకులు ఆదేశించారు.  అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్‌ ప్రభుత్వం బాలికలు, మహిళల రక్షణ కోసం ఇండ్లలో కిటికీలపై నిషేధం విధించింది.  కొత్తగా నిర్మించే ఇండ్లకు కిటికీలను ఏర్పాటు చేయరాదని ఆదేశించింది.
ఇప్పటికే ఉన్న ఇండ్లలోని కిటికీలను మూసివేసేలా యజమానులను ప్రోత్సహించాలని అధికారులకు చెప్పింది. మహిళలు సంచరించే వంట గది, పెరడు, బావి, ఇతర ప్రదేశాలు పొరుగింట్లో నుంచి కనిపించకుండా జాగ్రత్త వహించాలని తెలిపింది. వారు కనిపించకుండా గోడలు కట్టాలని స్పష్టం చేశారు. కొత్తగా నిర్మించబోయే ఇళ్లల్లో ఈ నిబంధనలు పక్కాగా అమలయ్యేలా చూడాలని తాలిబన్‌ సుప్రీం లీడర్‌ స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మహిళలు బయటకు కనిపించేలా నిర్మాణాలు ఉంటే వాటికి ఈ నిబంధనల ప్రకారం మార్పులు చేయాలని ఆదేశించారు.

2021లో ఆఫ్గానిస్థాన్‌లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబన్లు మహిళలపై కఠిన ఆంక్షలు కొనసాగిస్తున్నారు. పురుషులు వెంట లేకుండా మహిళలు ఇండ్ల నుంచి బయటకు రావడానికి వీల్లేదని, బాలికల సెకండరీ స్కూళ్లు మూసివేయాలని, మహిళలు ఉద్యోగాలు చేయకూడదని ఆదేశించారు. 

మహిళల ఉన్నత చదువులపై, ఈద్‌ వేడుకల్లో పాల్గొనడం, జిమ్‌లు, పార్కుల్లోకి మహిళల ప్రవేశంపై నిషేధం విధించారు. ఈ ఆంక్షలపై ఐక్యరాజ్య సమితి ఇప్పటికే పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది స్త్రీలపై దారుణ వివక్ష అని మండిపడింది.