
రానున్న 30 ఏండ్లలో కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా మానవ మనుగడకు ముప్పు ఏర్పడ వచ్చని ఏఐకి గాడ్ ఫాదర్‌గా పిలుచుకునే బ్రిటిష్- కెనడియన్ కంప్యూటర్ సైంటిస్టు ప్రొఫెసర్ జెఫ్రీ హింటన్ ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న మూడు దశాబ్దాలలో ఏఐ కారణంగా మానవ మనుగడకే ముప్పు ఏర్పడే అవకాశాలు 10 నుంచి 20 శాతం వరకు ఉన్నాయని ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమానం పొందిన హింటన్ తెలిపారు.
బీబీసీ రేడియో 4కి చెందిన టుడే ఇంటర్వ్యూలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. గతంలో మానవ మనుగడకు ఏఐతో వచ్చే ముప్పును 10 శాతంగా అంచనా వేసిన హింటన్ ఇప్పుడు దాన్ని 20 శాతానికి పెంచడం గమనార్హం. ఏఐతో సంభవించే ముప్పు గురించి మీ అంచనాలో మార్పు ఏమైనా ఉందా అన్న ప్రశ్నకు హింటన్ సమాధానమిస్తూ అది 10 శాతం నుంచి 20 శాతానికి పెరిగిందని జవాబిచ్చారు.
ఏఐతో తలెత్తే ముప్పు పెరిగే అవకాశం ఉందా అని ప్రశ్నించగా మన కన్నా ఎక్కువ మేధను మనం గతంలో ఎన్నడూ ఎదుర్కొనలేదని ఆయన చెప్పారు. ఏఐ వ్యవస్థలను ఆయన తల్లిగా, వాటిని నియంత్రించే మానవులను పిల్లలుగా ఆయన అభివర్ణించారు. నియంత్రణ లేని ఏఐ అభివృద్ధి వల్ల ఎదురయ్యే ప్రమాదాల గురించి స్వేచ్ఛగా మాట్లాడేందుకు 2023లో గూగుల్ సంస్థ నుంచి హింటన్ బయటకు రావడంతో ఈ టెక్నాలజీకి సంబంధించి ఆయన వ్యక్తం చేసిన ఆందోళనలు మొదటిసారి బహిర్గతమయ్యాయి.
ఏఐ అభివృద్ధి శరవేగంగా జరుగుతుండడంపై స్పందిస్తూ ఈ స్థాయిలో ఈ రోజు ఇలా ఉంటుందని తాను ఊహించలేదన్నారు. మనుషుల కన్నా ఏఐ వ్యవస్థలు మరింత తెలివైనవిగా మారతాయన్న ఏఐ రంగ నిపుణుల అంచనాల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ రంగంలో జరుగుతున్న అభివృద్ధి తాను ఊహించిన దానికన్నా చాలా వేగంగా ఉందని, దీనిపై ప్రభుత్వ నియంత్రణ అత్యంత అవసరమని హింటన్ స్పష్టం చేశారు. బడా కంపెనీలు ఏఐ అభివృద్ధిలో జాగ్రత్తలను పట్టించుకోవని చెప్పారు. భద్రతకు సంబంధించి ప్రభుత్వ నియంత్రణే ముఖ్యమని అభిప్రాయపడ్డారు.
More Stories
భారత్‌ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి