
టిబెట్‌లో బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోకెల్లా అతిపెద్ద డ్యామ్ నిర్మించబూనడాన్ని చైనా శుక్రవారం సమర్థించుకుంది. నది నీరు ప్రవహించే పరిసర రాష్ట్రాల్లో భద్రత సమస్యలు దృష్టిలో ఉంచుకునే నిర్మాణం చేపడతానని స్పష్టం చేసింది. ఇందుకు దశాబ్దాలుగా అధ్యయనం చేసినట్లు పేర్కొంది. 137 బిలియన్ అమెరికా డాలర్లతో నిర్మించే ఈ డ్యామ్ విషయంలో ఎలాంటి భయాందోళనలను పెట్టుకోవద్దని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ స్పష్టం చేశారు.
సురక్షణ విషయంలో దశాబ్దాలుగా లోతైన అధ్యయనాలు చేసినట్లు కూడా ఆమె పేర్కొన్నారు. టిబెట్‌లో హైడ్రో పవర్ అభివృద్ధిపై, రక్షణ చర్యలపై దశాబ్దాలుగా అధ్యయనాలు చేపట్టినట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాలలో ఈ ప్రాజెక్టు ఎలాంటి నష్టం కలిగించబోదని ఆమె స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాలున్న దేశాలతో చైనా ఈ విషయంలో చర్చలు కొనసాగించగలదని పేర్కొన్నారు.
ఇదిలావుండగా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి చైనా బుధవారం ఆమోదం తెలిపింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్ఫ్రా ప్రాజెక్టు కాగలదని పేర్కొంది. డిసెంబర్ 18న సీమాంతర సరిహద్దు నదుల విషయం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మధ్య జరిగిన చర్చల్లో చోటుచేసుకుంది.
కాగా భూకంపాలు సంభవించే టెక్టోనిక్ ప్లేట్ సరిహద్దులో ఈ ప్రాజెక్టు సైట్ ఉండడం వల్ల అనేక ఇంజనీరింగ్ సవాళ్లను లేవనెత్తగలదని భావిస్తున్నారు. టిబెట్ పీఠభూమిని ‘ప్రపంచ పై కప్పు’గా పరిగణిస్తుంటారు. టెక్టోనిక్ ప్లేట్లో ఈ ప్రాంతం ఉన్నందున ఇక్కడ తరచూ భూకంపాలు వస్తుంటాయి.
టిబెట్‌లోని బ్రహ్మపుత్ర నదిపై 137 బిలియన్ల డాలర్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో వుంది. దీంతో పరీవాహక దేశాలైన భారత్, బంగ్లాదేశ్‌ల్లో ఆందోళనలు నెలకొన్నాయి. బ్రహ్మపుత్ర నదిని టిబెట్‌లో యార్లంగ్ జంగ్బోగా పిలుస్తారు. ఆ నదీ దిగువ ప్రాంతంలో పెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి చైనా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఇప్పటివరకు ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్‌గా భావించే త్రీ గోర్జెస్ డ్యామ్‌కు ఇది దాదాపు మూడు రెట్లు పెద్దదిగా వుంటుంది. ఏడాదికి 300 బిలియన్ల కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని సంబంధిత నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ ప్రాజెక్టుతో టిబెట్‌కు ఏటా 20బిలియన్ల యువాన్ల ఆదాయం లభిస్తుంది. అత్యంత నాణ్యతతో కూడిన అభివృద్ధి పంథాను అనుసరించేందుకు దేశం చేస్తున్న కృషిని మరింత వేగవంతం చేయడంలో ఈ ప్రాజెక్టు సానుకూల పాత్ర పోషిస్తుందని చైనా ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.
More Stories
భారత్ లక్ష్యంగా కొత్త చట్టానికి ట్రంప్ ప్రతిపాదన
భారత్‌ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!