మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను కేంద్ర ప్రభుత్వం శనివారం అధికారిక లాంఛనాలతో రాజ్‌ఘాట్ సమీపంలో నిర్వహించనుంది. అంతిమ యాత్ర ఉదయం 9.30 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రారంభమౌతుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
“ప్రస్తుతం మన్మోహన్ సింగ్ పార్థివ దేహం మోతీలాల్ నెహ్రూ రోడ్డులోని ఆయన నివాసంలో ఉంది. రేపటి ఉదయం వరకు ప్రజలు అక్కడి వచ్చి నివాళులు అర్పించవచ్చు. డిసెంబర్ 28న అంటే శనివారం ఉదయం 8 గంటలకు ఆయన భౌతిక కాయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్తాం” అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
“అక్కడ ఉదయం 8.30 నుంచి 9.30 మధ్య ప్రజలు, పార్టీ కార్యకర్తలు నివాళులు అర్పించేందుకు అవకాశం ఇస్తాం. 9.30 గంటల తరువాత అక్కడి నుంచి శ్మశాన వాటికకు మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర మొదలవుతుంది” అని చెప్పారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల కేంద్ర కేబినెట్ శుక్రవారం సంతాపం తెలిపింది. మన్మోహన్ గొప్ప రాజనీతిజ్ఞుడని, విశిష్ట నాయకుడిని కొనియాడింది. ప్రధాని మోదీ అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో, మాజీ ప్రధాని మృతికి సంతాప సూచికంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. తరువాత సంతాప తీర్మానాన్ని ఆమోదించారు.
జనవరి 1 నుంచి 7 రోజులపాటు సంతాప దినాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా జాతీయ జెండాను అవనతం చేసింది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు హాఫ్‌డే సెలవు ప్రకటించింది.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై ప్రపంచ దేశాలకు చెందిన నేతలు సంతాపం తెలిపారు. మన్మోహన్‌ను ఒక ఛాంపియన్‌గా, దూరదృష్టి గల ఆర్థికవేత్తగా, భారతదేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా అభివర్ణించారు. తమ దేశాలతో భారత్‌కు ఏర్పడిన బంధంలో మన్మోహన్ సహకారాన్ని, స్నేహపూర్వక సంబంధాలను గుర్తు చేసుకున్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపట్ల అమెరికా సంతాపం ప్రకటించింది. భారత దేశ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. భారత్ -అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య గొప్ప ఛాంపియన్లలో మన్మోహన్ ఒకరని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ కొనియాడారు. గత రెండు దశాబ్దాల్లో భారత్-అమెరికా కలిసి సాధించిన ప్రగతిలో చాలా వాటికి మన్మోహన్ పునాది వేశారని తెలిపారు. భారత్-అమెరికా మధ్య పౌర అణు సహకార ఒప్పందం ముందుకు తీసుకెళ్లడానికి మన్మోహన్ నాయకత్వం దోహదం చేసిందని తెలిపారు.

More Stories
కశ్మీర్ రాజ్యసభ ఎన్నికల్లో ఎన్సీని అడ్డుకున్న బీజేపీ
లింగ నిష్పత్తిలో కేరళ ఆదర్శవంతం
బీహార్ లో అన్ని ఎన్నికల రికార్డ్లను బ్రేక్ చేస్తాం