ఇంద్రకీలాద్రిపై ముగిసిన భవానీదీక్ష విరమణలు

ఇంద్రకీలాద్రిపై ముగిసిన భవానీదీక్ష విరమణలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీదీక్ష విరమణలు ఘనంగా ముగిశాయి. చండీహోమం మందిరంలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నెల 21వ తేదీన ప్రారంభమైన భవానీదీక్ష విరమణలో మండల దీక్ష, అర్ధమండల దీక్ష వహించిన భవానీమాలదారులు పాల్గొన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో దీక్షలను విజయవంతం చేయగలిగామని ఆలయ ఈవో కేఎస్‌ రామరావు తెలిపారు.

జై భవానీ.. జై జై భవానీ అంటూ అమ్మవారి నామ స్మరణలతో దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం మార్మోగింది. 21వ తేదీన హోమగుండంలో అగ్ని ప్రతిష్టాపనతో మొదలైన దీక్ష విరమణ – ఇవాళ పూర్ణాహుతితో పరిసమాప్తమైంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ఇంద్రకీలాద్రి క్షేత్రం విరాజిల్లుతున్నందున కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. 

కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఆదిపరాశక్తిని దర్శించుకుని, భక్తులు అత్యంత ఆధ్యాత్మిక మధురానుభూతి పొందారు. గత ఉత్సవాలకు భిన్నంగా ఈసారి సాంకేతికతను అన్ని విభాగాల్లోనూ అనుసంధానం చేశారు. భవానీదీక్షలు-2024 పేరిట 24 రకాల వివరాలకు చెందిన సమస్త సమాచారాన్ని పూర్తి శాస్త్రీయంగా తెలుసుకునేలా రూపొందించిన యాప్‌కు మంచి ఆదరణ లభించింది. 

అలాగే చిన్నారులు తప్పిపోకుండా ఉండేందుకు క్యూ ఆర్‌ కోడ్‌తో కూడిన ఓ బ్యాండ్‌ను పిల్లల చేతికి కంకణంలా అమర్చి దాని సహాయంతో ఎక్కడైనా ఎవరైనా తప్పిపోతే ఆ బ్యాండ్‌కున్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి సంబంధిత కుటుంబ సభ్యులు అందించే విధానాన్ని మొదటి సారి ప్రవేశపెట్టారు. మహిళా శిశు సంక్షేమశాఖ తరఫున ఈ ట్యాగ్‌లను రూపొందించి విజయవంతంగా పిల్లలు తప్పిపోకుండా తమవంతు సాయం చేశారు. 

భక్తులను వరుసల్లోకి పంపించి వారి భద్రతు భరోసాగా నిలవడమే కాకుండా పోలీసులు డోన్లు, సీసీ కెమేరాల సహాయంతో త్వరగా భక్తులకు దర్శనం పూర్తయ్యేలా సాంకేతికతను సద్వినియోగం చేసుకున్నారు.  ఉత్తరాంధ్రతో పాటు ఉభయగోదావరి జిల్లాల పరిధిలోనూ గత నాలుగు రోజుల నుంచి వర్షాలు కొనసాగుతున్నందున అక్కడి భక్తుల కోరిక మేరకు  గురువారం సాయంత్రం వరకు హోమగుండాలను యథావిధిగా ఉంచాలని దేవస్థానం నిర్ణయించింది. 

ఈ నెల 28వ తేదీ నుంచి ఆర్జిత సేవలను పునః ప్రారంభించ నున్నందున అప్పటి వరకు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టిక్కెట్టు దర్శనాలను పునరుద్ధరించాలని భావిస్తున్నారు.