అజాత శత్రువు, ఏకాభిప్రాయ ధీరుడు, ప్రజాస్వామ్యవాది… వాజపేయి

అజాత శత్రువు, ఏకాభిప్రాయ ధీరుడు, ప్రజాస్వామ్యవాది… వాజపేయి
* శతజయంతి నివాళి
 
స్వతంత్ర భారత దేశంలో అత్యుత్తమ ప్రధాని ఎవ్వరు? అంటే జవాబు చెప్పడం కష్టమే. ప్రతి ప్రధాని దేశాభివృద్ధి సాధనలో తమ వంతు కృషి చేసినప్పటికి ఒకొక్కరికి ఒక్కొక్క `చీకటి కోణం’ లేకపోలేదు. దేశంలో తొలి ప్రధానిగా వ్యవస్థలను ఏర్పాటు చేయడంలో కీలక భూమిక వహించిన జవహర్ లాల్ నెహ్రు సృష్టించిన కాశ్మీర్, చైనా సమస్యల నుండి భారత్ ఇంకా బయటపడలేదు. 
 
అత్యంత సాహసోపేతమైన, బలమైన నాయకురాలిగా పేరొందిన ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ అకృత్యాలు, రాజకీయాలలో అంతర్గత ప్రజాస్వామ్యంకు సమాధిచేసి భజనపరులను చేరదీయడం ద్వారా మన ప్రజాస్వామ్య వ్యవస్థనే నిర్వీర్యం చేశారు. 1991 ఇండో- పాకిస్తాన్ యుద్ధంలో ఘనవిజయం, హరిత విప్లవం వంటి ఆమె ఘనకార్యాలు తెరమరుగయ్యాయి.
 
`ఆధునిక భారత్’ కల్పనను మనముందుంచిన రాజీవ్ గాంధీ షహనో బాను కేసు విషయంలో, శ్రీలంకలో ఎల్ టి టి ఈ విషయంలో అనుసరించిన విధానాలు మన దేశానికి పెను సమస్యలు సృష్టించాయి. మైనారిటీ నేతగా పూర్తికాలం అధికారంలో కొనసాగినా పివి నరసింహారావు ఎప్పుడూ బలమైన నేతగా గుర్తింపు పొందలేదు. డా. మన్మోహన్ సింగ్ పాలన అయితే తెరవెనుక ఎటువంటి అధికారం లేని పార్టీ అధ్యక్షురాలి అదుపాజ్ఞలలో పనిచేసిన నేతగా అపకీర్తిని మూటకట్టుకున్నారు. 
 
అటల్ బిహారి వాజపేయిని `అత్యుత్తమ ప్రధాని’గా చెప్పలేక పోయినా `అత్యంత మెరుగైన ప్రజాదరణ’ గలిగిన నేతగా గుర్తింపు పొందారు. ఇప్పటికీ ఆయనపై గల ప్రజాదరణ చెక్కుచెదరలేదు. అన్ని రాజకీయ పక్షాలు ఆయన పట్ల సానుకూల ధోరణి ప్రదర్శిస్తుంటాయి. ఒక విధంగా `అజాత శత్రువు’గా మనుగడ సాగించారు. 
 
సంకీర్ణ రాజకీయాలకు ఓ కొత్త భాష్యం చెప్పారు. `ఏకాభిప్రాయ సాధన’ ద్వారా పాలన సాగించడం, విభిన్న ఆలోచనలు కలిగిన వారితో కలిసి పనిచేయగలగడం ఆయనకే చెల్లుబాటయింది. ఏనాడూ అధికారం కోసం `అడ్డదారులు’ అనుసరించలేదు. జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయంగా సహితం ఆయన ఘనమైన కీర్తి పొందారు.
 
ముఖ్యంగా ఆయన ప్రధానిగా లాహోర్ కు జరిపిన బస్సు యాత్ర, భారత్ ను అణు సామర్థ్యం గల దేశంగా మలచడం ఆయన చేపట్టిన అత్యంత సాహసోపేత చర్యలని చెప్పవచ్చు.  ఆనాడు ఆయన జరిపిన లాహోర్ బస్సు యాత్రను భారతీయులే కాకుండా పాకిస్తాన్ ప్రజలు సహితం హృదయపూర్వకంగా హర్షించారు. 
 
గతంలో మొరార్జీ దేశాయి ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పాకిస్తాన్ తో మైత్రి పట్ల ఆయన నిజాయతీతో నిబద్దత ప్రదర్శించారు. అయితే లాహోర్ బస్సు యాత్ర తర్వాత పాకిస్తాన్ లో జరిగిన `సైనిక కుతంత్రం’ కారణంగా కార్గిల్ యుద్ధం రావడం, రెండు దేశాల మధ్య సంబంధాలు కోలుకోలేని విధంగా దారి తప్పడం మరో విషయం.
 
మే 2003లో, అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు కీలక సహాయకుడు కార్ల్ ఇండెర్‌ఫర్త్, ది హిందూలో వ్రాసిన ఓ వ్యాసంలో “భారతదేశం, పాకిస్తాన్ నాయకులు సామరస్యంగా జీవించాలనే తమ కొత్త సంకల్పాన్ని అమలు చేయడంలో విజయవంతమైతే వారు నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకోవడం ఖాయం” అని పేర్కొన్నారు. 
 
ఆ వ్యాసం చూపించినప్పుడు “నేను నోబెల్ శాంతి బహుమతి కోసం ఇదంతా చేస్తున్నానా?” అంటూ వాజపేయి ఆవేదన వ్యక్తం చేయడం రెండు పొరుగు దేశాల మధ్య సామరస్యం నెలకొల్పే విధంగా ఆయనలోని నిజాయతీని వెల్లడిస్తుంది.
 
ప్రతిపక్ష నేతగా నాటి ప్రధాన మంత్రులతో సామరస్యంగా మెలగడమే కాకుండా, క్లిష్టమైన సమయాలలో ఆయా ప్రభుత్వాలకు అండగా నిలబడటం కూడా ఆయనకే చెల్లుబడి అయింది. పివి నరసింహారావు ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణల పట్ల కాంగ్రెస్ పార్టీలోనే తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతున్న సమయంలో రూపాయి విలువ తగ్గించాలనే ప్రతిపాదనతో నాటి ఆర్ధిక మంత్రి మన్మోహన్ సింగ్ వచ్చారు. 
 
వెంటనే మంత్రివర్గ సమావేశం జరిపి, అందుకు అనుమతి తీసుకోమని సూచించారు. మంత్రివర్గ సమావేశం జరిపితే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందని చెప్పి ఆయనను పివి పంపించివేశారు. ఆ తర్వాత కొద్దీ సేపటికి అందుకు మన్మోహన్ సింగ్ కు అనుమతి ఇచ్చారు. కొద్దీ సేపట్లో ఏమి జరిగిందని అడిగితే `నేను వాజపేయితో మాట్లాడాను. ఆయన ఒప్పుకున్నారు. ఇక ఎవ్వరు వ్యతిరేకిస్తారు?’ అంటూ ప్రశ్నించారు.
 
లౌకికవాదం పేరుతో 13 రోజుల వాజపేయి ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు కూల్చివేశాయి. 2004లో లౌకికవాదం పేరుతోనే యుపిఎ ప్రభుత్వం ఏర్పాటయింది. కానీ ఆ తర్వాత బీజేపేని `అంటరాని పార్టీ’గా సృష్టించిన కాంగ్రెస్, వామపక్షాల ఎత్తుగడలను వాజపేయి పటాపంచలం కావించారు. ఎవ్వరూ ఊహించని విధంగా స్థిరమైన ఎన్డీయే ప్రభుత్వాన్ని అందించారు. 
 
ఒక ఓటుతో తన ప్రభుత్వం పడిపోయినప్పుడు బెదిరిపోలేదు. “తిరిగి పూర్తి ప్రజావిశ్వాసంతో ఈ సభలో అడుగు పెడతాను” అంటూ సాహసంతో అవిశ్వాస తీర్మానంను ఎదుర్కొన్నారు.  బలమైన సంకీర్ణ రాజకీయాలకు ఆద్యం పలికారు.
 
చారిత్రాత్మకమైన 1999 ఎన్నికల్లో “కాంగ్రెస్ నన్ను ఒక ఓటుతో ఓడించింది. మీరంతా ఒక ఓటు ఇచ్చిన నన్ను గెలిపించండి” అంటూ దేశవ్యాప్తంగా పర్యటనలు జరిపి ఇచ్చిన పిలుపుకు ప్రజల నుండి అనూహ్యమైన స్పందన లభించింది. 2004లో వాజపేయి ప్రభుత్వం ఓటమి చెందుతుందని ఎవ్వరూ ఊహించలేదు. కొందరు నేతల వ్యూహాత్మకంగా తొందరపాటు నిర్ణయాల కారణంగానే ఓటమి చెందారు. వాజపేయి ప్రభుత్వ ఓటమిని దేశ ప్రజలను జీర్ణించుకోలేక పోయారు కూడా.
 
బహుశా తన ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యయుతంగా వాజపేయి మాదిరిగా మరే ప్రధాని కూడా నడపలేదని చెప్పవచ్చు. ఆయన మంత్రివర్గ సమావేశాలలో ఉద్దండులైన నాయకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా అనుమతించేవారు. చివరకు అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకొనేవారు. జార్జ్ ఫెర్నాండెస్, నితీష్ కుమార్, రామ్ విలాస్ పాశ్వాన్, ఫారూఖ్ అబ్దుల్లా వంటి నేతలు సుదీర్ఘ ప్రసంగాలు మంత్రివర్గ సమావేశాలలో చేసేవారు. అటువంటి దృశ్యాలు ఆ తర్వాత మన దేశంలో అదృశ్యం అయిపోయాయి.
 
దేశంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో వాజపేయి నూతన చరిత్ర సృష్టించారు. జాతీయ రహదారుల అభివృద్ధి, పీఎం గ్రామ సడక్ యోజన, సర్వ శిక్షా అభియాన్, ఐటి – విద్యుత్ రంగాలలో సంస్కరణలు దేశ స్వరూపాన్నే మార్చివేశాయి. కేంద్ర- రాష్ట్ర సంబంధాలలో నూతన అధ్యాయం ఏర్పరిచారు. అంతర్జాతీయ సంబంధాలలో సహితం చారిత్రాత్మక పాత్ర వహించారు.
 
కార్గిల్ యుద్ధం సమయంలో మొదటిసారిగా పాకిస్థాన్ ను ఏకాకి చేశారు. ఏ దేశం కూడా ముందుకు వచ్చి ఆ దేశానికీ మద్దతు ఇవ్వలేకపోయాయి. పాకిస్తాన్ ను ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంగా ప్రపంచం ముందుంచ గలిగారు. భారత్ అణు పరీక్షల ద్వారా అమెరికా విధించిన ఆంక్షల నేపథ్యంలో భారత్ ను స్వయం సమృద్ధి సాధించే విధంగా చేయడంలో కీలకమైన పునాదులు వేశారు. 
 
స్వతంత్రం తర్వాత అమెరికాతో మెరుగైన సంబంధాలు ఏర్పర్చడంలో ఆయన ప్రభుత్వమే కీలకమైన ముందడుగు వేసింది. విదేశాంగ మంత్రిగా జస్వంత్ సింగ్, రక్షణ మంత్రిగా జార్జ్ ఫెర్నాండెస్, ఆర్ధిక మంత్రిగా యశ్వంత్ సిన్హా అందించిన సేవలు మరువలేము.
 
దేశాభివృద్ధిలో ఎదుర్కొంటున్న సవాళ్ళను పరిష్కరించడం కోసం అన్ని రాజకీయ పార్టీల సమిష్టి కృషితో ఓ బ్లూ ప్రింట్ తయారు చేయాలని ఇప్పటి వరకు ఎవ్వరూ చేయలేని ప్రయత్నం వాజపేయి చేశారు. నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎస్ ఎం కృష్ణ సారధ్యంలో బెంగళూరులో ముఖ్యమంత్రులతో ఓ గోష్టి జరిపే ప్రయత్నం చేశారు. అందుకు నాటి కాంగ్రెస్ కీలక నాయకులు సహితం సహకారం అందించారు. 
 
అయితే చివరి క్షణంలో నాటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆ గోష్టి పట్ల విముఖత వ్యక్తం చేయడంలో ముఖ్యమంత్రి ఎస్ ఎం కృష్ణ దాని నిర్వహణకు నిస్సహాయత వ్యక్తం చేయడంలో ఆ ప్రయత్నం ఫలించలేదు.  ఆయన సారథ్యంలో జాతీయ అభివృద్ధి మండలి సమావేశాలు, కేంద్ర – రాష్ట్ర మండలి సమావేశాలలో అర్ధవంతమైన చర్చలు జరుగుతూ ఉండెడివి. 
 
ఆ విధంగా దేశాభివృద్ధి కృషిలో అన్ని రాజకీయ పార్టీలను తనవెంట తీసుకెళ్లడంలో అరుదైన  నాయకత్వ లక్షణాలను వాజపేయి ప్రదర్శించారు. విలక్షణమైన ప్రజాస్వామ్య సంస్కృతిని ఆచరణలో చూపారు. ఆ రాజకీయ విలువలు నేడు ఎక్కడా కనిపించకపోవడం దురదృష్టకరం.  సొంత పార్టీలో సహితం భిన్నాభిప్రాయాలు గల నేతలతో కలిసి పనిచేసేవారు. తన అభిప్రాయాలను పార్టీ వ్యతిరేకించినా హుందాగా పార్టీ అభిప్రాయాన్ని స్వీకరించేవారు.