బిజెపి ఆధ్వర్యంలో వాజపేయి శతజయంతి ఉత్సవాలు

బిజెపి ఆధ్వర్యంలో వాజపేయి శతజయంతి ఉత్సవాలు
భారత ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డిసెంబరు 25వ తేదీ నుంచి అటల్ బిహారీ వాజ్ పేయి గారి శతజయంతి ఉత్సవాల సంవత్సరం పొడవుగా నిర్వహిస్తున్నట్లు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. నిర్వహణ. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో డిసెంబరు 25 నుంచి ఏడాది పాటు సమాజ సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాల ఏర్పాటు వంటి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

డిసెంబరు 24వ తేదీ మ. ఒంటిగంటకు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో వాజ్ పేయి జీవిత చరిత్రకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సుధాన్షు త్రివేది ప్రారంభిస్తారు.  డిసెంబరు 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్ బూత్ లలో వాజ్ పేయి గారి చిత్రపటానికి నివాళులర్పించి, శద్ధాంజలి ఘటిస్తారని ఆయన వివరించారు.

అన్ని మండల కేంద్రాల్లో శోభాయాత్ర నిర్వహించిన అనంతరం కూడళ్లలో వాజ్ పేయి గారి స్మారకంగా సభలు నిర్వహిస్తారు.  రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఫొటో ఎగ్జిబిషన్ తో పాటు వాజ్ పేయి కవితా సంపుటిని, దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ సదస్సులు, ప్రదర్శనల నిర్వహిస్తారు. ప్రతి మండల, జిల్లా కేంద్రంలో బిజెపి యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తారని డా. వెంకటేశ్వర్లు తెలిపారు.

స్వచ్ఛ భారత్ కార్యక్రమం, దవాఖానాల్లో రోగులకు పండ్లు, పేదలకు దుప్పట్ల పంపిణీతో పాటు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. హైదరాబాద్ లో ఉ. 11 గం.లకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వందమందితో రక్తదాన శిబిరం నిర్వహిస్తారు. మ. 3 గం.లకు అంబేద్కర్ విగ్రహం నుంచి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం వరకు శోభాయాత్ర జరుపుతారు. 

 
సా. 4 గం.లకు బిజెపి ప్రాంత కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి వాజ్ పేయి గారి కవితా సంపుటితో పాటు వివిధ సేవా కార్యక్రమాలను ప్రజలకు వివరించేలా సదస్సు నిర్వహిస్తారు. అటల్ బిహారీ వాజ్ పేయి గారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న స్మారక కార్యక్రమాలు, సదస్సులు, రక్తదాన శిబిరాలు, సాంస్కృతిక, సేవా కార్యక్రమాల్లో పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయగలరని ఆయన కోరారు.